Pooja Hegde - Ravi Teja : మాస్ మహారాజాతో బుట్ట బొమ్మ - పూజా హెగ్డేతో సంప్రదింపులు!
మాస్ మహారాజా రవితేజతో బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) నటించనున్నారా? వీళ్ళిద్దరి కలయికలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో...
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. 'డాన్ శీను'తో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని... ఆ తర్వాత రవితేజతో 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు.
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవల ఆమెను సంప్రదించారట.
ఇప్పటి వరకు రవితేజ, పూజా హెగ్డే కలిసి సినిమా చేయలేదు. అందువల్ల, వాళ్ళ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. పైగా, పూజా హెగ్డే ఉంటే నార్త్ ఇండియా మార్కెట్, హిందీ శాటిలైట్ అండ్ ఓటీటీకి కూడా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నారు.
Also Read : చిరంజీవి గారూ, ఆ సినిమాకు నా చేతులు కట్టేశారు - తమన్
సాయి ధరమ్ తేజ్ జోడీగా పూజా హెగ్డే!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. సంపత్ నంది దర్శకుడు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలోనూ కథానాయికగా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట.
Also Read : 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఇప్పటి వరకు మెగా కుటుంబంలోని ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా 'ఆచార్య'లో నటించారు. 'రంగస్థలం'లో ప్రత్యేక గీతం చేశారు. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద', 'గద్దలకొండ గణేష్' చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ నటించారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ జోడీగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించనున్నారని సమాచారం.
''సాయి తేజ్ సినిమా కోసం పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించిన మాట వాస్తవమే. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇదొక మాస్ ఎంటర్టైనర్. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది'' అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. రాబోయే ఏడాదిలో పూజా హెగ్డే నుంచి కనీసం ఐదారు సినిమాలు రావచ్చని తెలుస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

