Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓటమికి తల వంచలేదు... ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు
Pawan Kalyan Becomes MLA: పవర్ స్టార్... పవన్‌కు ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు. జనసేనాని... పార్టీ శ్రేణులు పిలిచే పేరు. ఇప్పుడు ఆయనకు ప్రజలు ఇచ్చిన హోదా... ఎమ్మెల్యే! అయితే... ఈ విజయం వెనుక కథ ఎంతో ఉంది.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్స్ మీద స్టిక్కర్లు, నంబర్ ప్లేట్స్ రెడీ చేయించారు. తమ అభిమాన కథానాయకుడి విజయం మీద వాళ్ల మదిలో ఎటువంటి సందేహాలు లేవు. ఈసారి అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టడం ఖాయమని ముందు నుంచి దృఢమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే... ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొనే అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు వచ్చారు పవన్ కళ్యాణ్.
ఓటమికి తల వంచలేదు...
ఒంటరి పోరాటం చేశాడు!
పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency)లో ఎమ్మెల్యేగా విజయం సాధించటానికి ముందు పవన్ కళ్యాణ్ మీద వినిపించిన ప్రధాన విమర్శ... 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో జనసేనాని ఓటమి చెందారు. ఆ దఫా ఎన్నికల్లో తన పార్టీ నుంచి ఎన్నికైన ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేకపోయారు. ఐదేళ్లల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయలేదని, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను సంఘటితం చేయలేదని విమర్శలు ఎన్నో!
ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు జనసేనను తెలుగు దేశంలో విలీనం చేస్తారని బోలెడు విమర్శలు వచ్చాయి. పవన్ వ్యక్తిగత జీవితం మీద వైసీపీ చేసిన విమర్శలకు లెక్క లేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పవన్ పెళ్లిళ్లపై హేళన చేసే వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో పవన్ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ఒంటరి పోరాటం చేశారు. తన ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన జవాబులు ఇచ్చారు. ఈ రోజు తాను విజయం సాధించారు. అంతే కాదు... తనతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.
తెలుగు సినిమా... రాజకీయం...
ప్రయాణంలో అదొక్కటీ కామన్!
చిత్రసీమలో కథానాయకుడిగా పవన్ ప్రయాణం గమనిస్తే... తోటి హీరోల తరహాలో ఆయనకు వరుస విజయాలు పది పదిహేనేళ్ల కాలంలో రాలేదు. 'ఖుషి' ఇండస్ట్రీ హిట్. అంతకు ముందు 'తొలిప్రేమ', 'బద్రి' వంటి సినిమాలు కొన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో లాభాలు తెచ్చాయి. అయితే... 'ఖుషి' తర్వాత కొన్నేళ్ల పాటు ఆయనకు నిలకడగా విజయాలు రాలేదు. కానీ, ఆ సమయంలో వచ్చిన వరుస ఫ్లాపులతో పవన్ ఇమేజ్ పెరిగిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
ప్రతి ఫ్లాప్ పవన్ మార్కెట్ పెంచింది. ప్రతి సినిమాకూ ఆయన ఫాలోయింగ్ బాగా పెరిగింది. మార్కెట్ లెక్కలకు, ఇండస్ట్రీ సూత్రాలకు అతీతంగా పవన్ ఇమేజ్ పెరగడం ఆశ్చర్యం. సేమ్ టు సేమ్... రాజకీయాల్లో కూడా అంతే! ఆయనకు గత పది పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన చుట్టూ రాజకీయాలు తిరిగాయని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు.
చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన తర్వాత జైలుకు వెళ్లిన పవన్, తన మద్దతు ప్రకటించడంతో పాటు కలిసికట్టుగా పోటీ చేస్తామని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తన పార్టీ సీట్లు కొన్ని త్యాగం చేయడంతో పాటు ప్రచారంలో ప్రముఖ భూమిక పోషించారు. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, ఆ పార్టీలో ఇతర కీలక నేతల కంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైసీపీ టార్గెట్ చేసిందంటే... ఆయన ఏ స్థాయిలో ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టించారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మంచితనం నలుసంత కాదు... ప్రజలను ప్రేమించే గుణం ఎవరెస్టు అంత - సినిమాల్లోనూ పవన్ ఇంతే
ఎన్నికలకు ముందు నుంచి ప్రచారంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి వినిపించిన మాట ఒక్కటే... వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని, క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని! ఆయన అన్నంత పని చేశారు. 'హలో ఏపీ... బైబై వైసీపీ' అనేది నిజం చేసి చూపించారు. పవర్ స్టార్... ఆయనకు సినీ ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు. జనసేనాని... జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు ఇచ్చిన పేరు. కానీ, పిఠాపురం ప్రజలు మాత్రం ఆయన్ను ఎమ్మెల్యే (Pawan Kalyan Wins Pithapuram) చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏం చేస్తారో అని యావత్ తెలుగు ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Also Read: పవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్ చల్