Pawan Kalyan - Tamil Film Industry : తమిళ చిత్రసీమ తమిళులకే అంటే ఎలా? మీరూ 'ఆర్ఆర్ఆర్' తీయాలి - పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
తమిళ చిత్రసీమ పెద్దలకు పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. తమిళ సినిమాల్లో తమిళులు మాత్రమే పని చేయాలనే స్వభావం నుంచి బయటకు రావాలని ఆయన కోరారు.
''మన పరిశ్రమ (సినిమాల్లో) లో, మనవాళ్ళు మాత్రమే చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని తమిళ చిత్ర పరిశ్రమకు, అందులోని పెద్దలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విధంగా మాట్లాడటం వెనుక ఓ కారణం ఉంది. అసలు వివరాల్లోకి వెళితే...
తమిళ సినిమా చిత్రీకరణలు తమిళనాడులో మాత్రమే చేయాలని, తమిళ చిత్రాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ తమిళులు అయ్యి ఉండాలని ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఇటీవల కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఒకవేళ ఆ నిబంధనలు అతిక్రమించినట్లు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో పవన్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు చిత్రసీమ అందరికీ అన్నం పెడుతోంది! - పవన్ కళ్యాణ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతోందని 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ సగర్వంగా చెప్పారు. అందరికీ ఆహ్వానం పలుకుతుందని ఆయన తెలిపారు. తమిళ చిత్రసీమ కూడా ఆ విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read : పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ''తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకే అంటే పరిశ్రమ ఎదగదు. ఈ రోజు తెలుగు చిత్రసీమ, మేము ఎదుగుతున్నామంటే... అన్ని భాషల నుంచి వచ్చిన వాళ్ళను తీసుకుంటున్నాం. కేరళ నుంచి వచ్చిన సుజీత్ వాసుదేవన్ (బ్రో సినిమాటోగ్రాఫర్), నార్త్ నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా (మై డియర్ మార్కండేయ గీతంలో నృత్యం చేశారు), విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన నీతా లుల్లా (కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్)ను మేం తీసుకుంటాం. అన్ని భాషలు, అన్ని కలయికలు ఉంటే సినిమా అవుతుంది తప్ప... కేవలం మన భాష వాళ్ళు మాత్రమే ఉండాలని అంటే కుంచించుకుపోతాం'' అని చెప్పారు.
మీరూ 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తీయాలి - పవన్ కళ్యాణ్
తమిళ చిత్రసీమలో కేవలం తమిళ వాళ్ళు మాత్రమే ఉండాలనే భావన ఏదో ఉందని బయట వింటున్నానని, అటువంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి, మరింత విస్తృత పరిధిలో 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తీయాలని, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తమిళ చిత్రసీమ ఎదుగుదలకు కారణం తెలుగువాడు - పవన్ కళ్యాణ్
తమిళ చిత్రసీమలో 'రోజా', 'జెంటిల్‌మన్' వంటి సినిమాలు వచ్చాయంటే అందుకు కారణం నిర్మాత ఏయం రత్నం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతం, కులం, మతం వంటి పరిధులు దాటాలని ఆయన చెప్పుకొచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ పెద్దది కావడానికి కారణం ఏయం రత్నం అని, ఆయన తెలుగు వాడని పవన్ కళ్యాణ్ వివరించారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికులకు సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించాలని, వాళ్ళకు ఉపాధి దొరకాలని, పరిష్కారం కోసం మరో ఉపాయం ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Also Read : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial