Paradha Total Collection: అనుపమ 'పరదా' టోటల్ కలెక్షన్స్... మూడు వారాలకు ఓటీటీలోకి, థియేటర్లలో ఎంత వచ్చిందో తెల్సా?
Total Worldwide Box Office Collection Of Paradha: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'పరదా' స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు సినిమా వచ్చేసింది. దీని టోటల్ కలెక్షన్ ఎంతో తెలుసా?

అనుపమ పరమేశ్వరన్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'పరదా'. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? థియేటర్లలో వచ్చిన టోటల్ కలెక్షన్ ఎంత? అనేది చూస్తే...
మలయాళంలో డిజాస్టర్... 16 లక్షలు!
అనుపమ పరమేశ్వరన్ మలయాళీ. నివిన్ పౌలి 'ప్రేమమ్'తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు వచ్చింది. 'పరదా'లో మరో మెయిన్ లీడ్ చేసిన దర్శనా రాజేంద్రన్ కూడా మలయాళీ. దాంతో మలయాళంలో 'పరదా'ను డబ్బింగ్ చేశారు. కానీ మూవీకి అక్కడ రెస్పాన్స్ సరిగా రాలేదు. థియేటర్ల నుంచి జస్ట్ పదహారు లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. వారం లోపే సినిమాను తీసేశారు.
తెలుగు ఆల్మోస్ట్ కోటి కలెక్ట్ చేసిన 'పరదా'
'పరదా' మీద అనుపమ పరమేశ్వరన్ బోలెడు నమ్మకం పెట్టుకుంది. సినిమాకు విపరీతంగా ప్రచారం చేసింది. కానీ, ప్రయోజం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. థియేటర్లలో పది రోజులు మాత్రమే నెట్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ మూవీ టోటల్ నెట్ కలెక్షన్ 94 లక్షలు.
Also Read: మిరాయ్ కలెక్షన్లు... మొదటి రోజు కుమ్మేసిన తేజా సజ్జా సినిమా, ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
తెలుగు, మలయాళ భాషల్లో 'పరదా' నెట్ కలెక్షన్స్ కలిపితే రూ. 1.10 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 1.22 కోట్లు. ఓవర్సీస్ నుంచి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ఏమీ రాలేదు. తెలుగులో 'పరదా'కు ఆ మాత్రం కలెక్షన్స్ రావడానికి కారణం వినాయక చవితి పండగ సెలవు. పండగపూట ఈ సినిమా 34 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. లేదంటే ఆ మాత్రం కూడా వచ్చేవి కావు. వినాయక చవితి తర్వాత ఈ సినిమా కేవలం 4 లక్షల నెట్ మాత్రమే తెలుగులో రాబట్టింది. పది రోజుల తర్వాత ప్రేక్షకుల రాక తగ్గింది. సినిమాను తీసేశారు.
ప్రైమ్ వీడియో ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్!
Paradha OTT Streaming Update: థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో 'పరదా'ను త్వరగా ఓటీటీలోకి తీసుకు వచ్చారు. థియేటర్లలో ఆగస్టు 22న సినిమా విడుదల అయ్యింది. ఆ రిలీజ్ అయిన మూడు రోజులకు సినిమా ఓటీటీలోకి వచ్చింది. 21 రోజుల గ్యాప్‌తో వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.
అనుపమ పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన 'పరదా'కు శ్రీకాంత్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. నట కిరీటి డా రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాగ్ మయూర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. సంగీత భర్తగా హర్షవర్ధన్ వినోదం పండించారు. ఈ సినిమాను ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకడ ప్రొడ్యూస్ చేశారు.





















