Yatra 2: జనం మధ్య జగన్ - 'యాత్ర 2' నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్, పాత్రలో లీనమైన జీవ
మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యాత్ర 2'కు సంబంధించి మరో పోస్టర్ విడుదలైంది ఈ పోస్టర్లో జగన్ పాత్ర పోషిస్తున్న తమిళ హీరో జీవా ప్రజల మధ్య కనిపించి ఆకట్టుకున్నారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'యాత్ర 2' నుంచి మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో జగన్ పాత్రలో జీవా జనం మధ్యలో కనిపించి ఆకట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర'(Yathra) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మహి. వి రాఘవ దర్శకత్వ వహించిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపించి అద్భుతమైన నటన కనబరిచారు.
పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావుగా రావు రమేష్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యాత్ర మూవీలో తన అద్భుత నటనతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ఇప్పుడు ఇదే సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. 'యాత్ర 2'(Yathra2) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైయస్సార్ తో పాటు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు.
2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 'యాత్ర 2'కు సంబంధించి మోషన్ పోస్టర్, మమ్ముట్టి, జీవా ఫస్ట్ లుక్స్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జీవా పాత్రకు సంబంధించి మరో పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో జీవా ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన డైరెక్టర్ మహి. వి రాఘవ.." జగన్ పాత్రలో జీవా జీవించాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు. నాతో ఏకీభవిస్తారు" అని రాసుకొచ్చాడు.
దీంతో 'యాత్ర 2' నుంచి విడుదలైన ఈ పవర్ ఫుల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. యాత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను హైలైట్ చేసిన మహి. వి రాఘవ 'యాత్ర 2'లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాతి పరిణామాలను చూపించబోతున్నారు. వాటిలో ముఖ్యంగా వైయస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం, జగన్ పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం తదితర అంశాలను బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 'యాత్ర' మూవీ రిలీజైన రోజే అంటే ఫిబ్రవరి 8, 2024 న 'యాత్ర 2' ని రిలీజ్ చేస్తున్నారు.
Also Read : వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి - డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన శ్యామలా దేవి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram