Nayak Sequel: నాయక్ మూవీకి సీక్వెల్? 23 ఏళ్ల తర్వాత కలవనున్న అనిల్ కపూర్, రాణి ముఖర్జీ
Nayak Sequel: ఒక తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కి ప్రేక్షకుల దృష్టిలో క్లాసిక్‌గా నిలిచిపోయిన బాలీవుడ్ చిత్రం ‘నాయక్’. 23 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Nayak The Real Hero Sequel: ఎన్నో ఏళ్ల క్రితం కలిసి నటించిన హీరో, హీరోయిన్లను మళ్లీ ఒక సినిమా ద్వారా కలపడంతో ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. అంతే కాకుండా ఎన్నో ఏళ్ల క్రితం హిట్ సాధించిన చిత్రాలకు ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కించడం కూడా ఒక ట్రెండ్‌గా మారింది. అందులో భాగంగానే బాలీవుడ్‌లో 23 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ఒక క్లాసిక్ కపుల్ కలిసి నటించడాన్ని.. ప్రేక్షకులు మళ్లీ తెరపై చూడనున్నారు. వాళ్లు మరెవరో కాదు.. అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ. ఇప్పుడు వీరిద్దరూ వీరి హిట్ సినిమా సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నారు.
త్వరలోనే అధికారిక ప్రకటన..
2001లో అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ కాంబినేషన్‌లో ‘నాయక్: ది రియల్ హీరో’ అనే మూవీ తెరకెక్కింది. పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ‘నాయక్’.. ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ దక్కించుకుంది. ఇప్పటికీ దీనిని కల్ట్ మూవీగా ప్రేక్షకులు భావిస్తారు. ఇక 23 ఏళ్ల తర్వాత ‘నాయక్’కు సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘నాయక్’ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుండే సీక్వెల్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ముకుట్ స్వయంగా రివీల్ చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ఆయన తెలిపారు.
ఫైనల్ చేయలేదు..
‘‘మేము నాయక్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాం. ఉన్న పాత్రలతో కథను ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. నిర్మాత ఏఎం రత్నం నుండి చాలాకాలం క్రితమే నేను రైట్స్‌ను కొనుక్కున్నాను. ప్రస్తుతం లీడ్ రోల్స్‌ను, ఇతర పాత్రలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాస్తున్నాం. రైటింగ్ పూర్తయిన తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తాం. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. అనిల్ కపూర్, రాణీ ముఖర్జీలతో చర్చలు మొదలయ్యాయి. ఇతర క్యారెక్టర్లు ఎవరు చేయాలనే విషయంపై చర్చలు సాగుతున్నాయి’’ అని ముకుట్ తెలిపారు. మొత్తానికి అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ.. మళ్లీ ఈ సినిమా కోసం కలిసి నటించనున్నారని అర్థమవుతోంది.
తమిళ చిత్రానికి రీమేక్..
‘నాయక్’లాగానే దీని సీక్వెల్‌లో కూడా అవినీతి గురించి సోషల్ మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముధల్వన్’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘నాయక్’. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే.. ఆసక్తిగా చూసే ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అనిల్ కపూర్, రాణీ ముఖర్జీతో పాటు అమ్రీష్ పూరీ, పరేశ్ రావల్, జానీ లీవర్ కూడా ‘నాయక్’లో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉండగా.. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తున్నారనే వార్త బాలీవుడ్ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది.
Also Read: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు