MAA Politics : ‘మా’కు మోడీకి ఏంటి సంబంధం ? ‘అతి’ స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !
"మా"ఎన్నికల్లో రెండు ప్యానళ్ల విమర్శలు అతి స్థాయికి చేరాయి. చివరికి ప్రధాని మోడీని కూడా ఇందులోకి లాగారు. ఇక రెండు రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారో ?
రసవత్తరమైన పొలిటికల్ స్టోరీతో ఇంత వరకూ టాలీవుడ్‌లో గొప్ప సినిమా రాలేదు. నేటి రాజకీయాలను ప్రతిబింబిస్తూ ఎవరూ కథ రాయడం కానీ.. దాన్ని తెరకెక్కించి ప్రజల మన్ననలు పొందడం కానీ చేయలేదు. కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటి ఓ పొలిటికల్ సినిమాను సూపర్ హిట్ చేసి చూపిస్తున్నారు నటీనటులు. ఎవరి పెర్‌ఫార్మెన్స్ తగ్గట్లేదు. మీడియా ముందుకు వచ్చి జీవించేస్తున్న పొలిటికల్ ధ్రిల్లర్‌లో అన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ధ్రిల్లర్ ఎలక్షన్ స్టోరీలోకి టాలీవుడ్ నుంచి మోడీ వరకూ అన్ని అంశాలనూ వాడేశారు. అందుకే ప్రజలంతా ఔరా " మా" ఎలక్షన్స్ అనుకునే పరిస్థితి వచ్చింది.
ఎక్కడ ప్రారంభమైంది ? ఎక్కడకు వెళ్లింది ?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నానంటూ ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌తో ప్రకటించిన రోజున ఇదో సూపర్ హిట్ సినిమా అవుతుందని ఎవరూ అనుకోలేదు. అలాంటి అంచనాలు కూడా లేవు. స్టార్టింగ్ సింపుల్‌గానే ఉంది. కానీ ముందుకు నడిచే కొద్దీ అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహంతో ప్రారంభమై.. ఇండస్ట్రీ అంతా రెండు వర్గాలుగా విడిపోయి .. ఫిర్యాదులు, ఆరోపణలు, హెచ్చరికలు ఇలా అన్ని కోణాల్లోనూ సీన్లు కనిపిస్తున్నాయి. దీంతో మీడియా ..సోషల్ మీడియాలోనూ ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. అందరూ చర్చలు కూడా ఈ ఎన్నికలపైనే పెడుతున్నారు.
Also Read : విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
చివరికి ప్రధాని మోడీని కూడా లాగేశారు !
మొదట లోకల్ - నాన్ లోకల్ అనుకున్నారు. తర్వాత ఆ గ్రూపు - ఈ గ్రూపు అనుకున్నారు. తర్వాత లెఫ్ట్ వింగ్ - రైట్ వింగ్ అనుకున్నారు. తర్వాత ఫలానా పార్టీకి అనుకూలం - వ్యతిరేకం అని వాదించుకున్నారు. చివరికి మోడీకి అనుకూలమా..? వ్యతిరేకమా ? అని కూడా అనేసుకున్నారు. ఫలానా ప్యానల్‌కు ఎందుకు ఓటేయకూడదు అంటే.. ఆయన మోడీకి వ్యతిరేకం కాబట్టి ఓటేయకూడదు అని సీవీఎల్ నరిసంహారావు అనేశారు. అసలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధం ఏముంది.? చాలా మంది ప్రకాష్ రాజ్ భావజాలాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకం అంటున్నారు. ఆయన హిందూ వ్యతిరేకి అని మరికొందరంటున్నారు. ఇక మంచు విష్ణును వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా చాలా మాటలంటున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వారసుడు అంటున్నారు. యాక్టింగ్ రాదని కూడా అంటున్నారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
జగన్, కేసీఆర్, కేటీఆర్‌లనూ వాడేసుకున్నారు..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ పడేవాళ్లంతా సెలబ్రిటీలే. ఎవరి స్థాయిలో వాళ్లు సెలబ్రిటీలు, అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లకు రాజకీయ నేపధ్యాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ప్రకాష్ రాజ్ ఆయనతో కలిసి పని చేశారు. జగన్‌కు మద్దతుగా పలుమార్లు మాట్లాడారు. ఇక నేరుగా జగన్‌తో విష్ణుకు బంధుత్వం ఉంది. అందుకే ఆయన పలుమార్లు మా బావ సీఎం జగన్ అని చెప్పుకోవడానికి ఎక్కడా సంకోచించలేదు. జగన్, కేసీఆర్, కేటీఆర్‌ల పేర్లు చెప్పి భయపెడతావా అని ప్రకాష్ రాజ్ ఎదురుదాడి కూడా చేశారు. తనకూ వారందరూ తెలుసని కూడా చెప్పుకొచ్చారు. ఆ పరిచయాలను వాడుకవోవడంతో రెండు ప్యానళ్లు తమ వంతు కృషి చేస్తున్నాయి.
Also Read : ఓటుకు రూ.75 వేలు ఇచ్చా.. మహేష్ బాబుకు ‘గూగుల్ పే’ చేశా.. నాగబాబుకు విష్ణు కౌంటర్
ఇంతా చేసి "మా"లో ఓట్లేసేవాళ్లు 500 మంది ఉంటారా ?
వందల కోట్ల నిధులు.. వేల మంది సభ్యులు ఉండే కొన్ని అసోసియేషన్ల ఎన్నికలు కూడా జరగనంత రాజకీయాలతో "మా" ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతా చేసి "మా"లో ఓట్లు వేయడానికి ఎంత మంది వస్తారు. "మా"లో ఓట్లు వేయడానికి వచ్చేది కేవలం ఐదు వందల మందిలోపే ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అదే పరిస్థితి. స్టార్ హీరోలు కానీ.. ఓ మాదిరి హీరోలు కానీ.. బాగా పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ.. కమెడియన్లు కానీ "మా"లో ఓటు వేయడాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. ఓటు వేయడానికి రారు. ఇక ఓట్లు వేసేది ఎవరు అంటే.. ఫేడవుట్ అయిపోయినా పరిశ్రమనే పట్టుకుని వేలాడుతున్న ఆర్టిస్టులు, ఎప్పుడో సినిమాల్లో నటించడం మానేసిన వారు అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవారు కొంత మంది ఉంటారు. వారు మాత్రమే ఓట్లు వేస్తారు. నిజానికి వారి కోసమే గెలిచిన "మా" ప్యానల్ కూడా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు "మా" నుంచి సాయం పొందాల్సిన అవసరం ఉండదు.
Also Read : ఫృథ్విరాజ్ స్వీట్ వార్నింగ్.. అతడిలో మీకు ఏం నచ్చింది? ఫోన్ కాల్ లీక్!
"ఈగో" వల్లే "మా" ఎన్నిక మోడీని వాడుకునేవరకూ వెళ్లిందా ?
బ్యాంక్ బ్యాలెన్స్‌లు లేకపోయినా టాలీవుడ్‌లో ఈగో అందరికీ టన్నుల్లో ఉంటుందని ఇటీవల మంచు విష్ణు ఓ చోట వ్యాఖ్యానించారు. "మా" సామర్థ్యాన్ని.. నిధులు.. పనులను బట్టి చూస్తే ఈ ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా మారడానికి ఆ ఈగోనే కారణం అని అనుకోవచ్చు. పోటీ పడుతున్న వారికి డబ్బులకు కొదవలేదు. తామంటే తాము గొప్ప అని నిరూపించుకోవాలన్న ఈగోనే ఉంది. అందుకే లోకల్ సెంటిమెంట్ నుంచి మోడీ అండ వరకూ దేనని వదిలి పెట్టకుండా వాడేసుకుంటున్నారు.
Also Read : నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి