Acharya: ఆచార్యలో జరిగిన తప్పులు ఇవే - కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. దానికి కారణాలేంటంటే?
కర్ణుడి చావుకు వంద కారణాలు అంటారు. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. సినిమా హిట్ అయినప్పుడు అందులో కొన్ని లోపాలున్నా మరుగున పడిపోతాయి. కానీ సినిమా ఫెయిలైతే మాత్రం అందులో ఉన్న తప్పులే హైలెట్ అవుతాయి. ఇప్పుడు ఆచార్య విషయంలో కూడా అదే హైలెట్ అయింది.
అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించడంతో ఈ సినిమాపై ప్రకటించిన రోజు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఖైదీ నంబర్ 150, సైరాల తర్వాత చిరంజీవి, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి విడుదలైన సినిమా కావడంతో ఆచార్య మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే సినిమాకు ఉదయం నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీనికి కారణాలేంటి?
హైప్ ఎక్కించలేకపోయారు
ముందుగా సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంలో సినిమా యూనిట్ విఫలం అయింది. ఆచార్య, సిద్ధల క్యారెక్టర్ టీజర్లతో పాటు మణిశర్మ స్వరపరిచిన పాటలు పెద్దగా హిట్ కాలేదు. దీనికి తోడు ఆ పాటలపై కాపీ విమర్శలు కూడా వచ్చాయి. ఏ సినిమాకు అయినా ఓపెనింగ్స్ రావాలంటే హైప్ అనేది కంపల్సరీ. ఆచార్య ఫెయిల్యూర్ అక్కడే మొదలైంది.
హైప్ లేకపోయినా సినిమాలో కంటెంట్ సరిగ్గా ఉంటే స్టార్‌డంతో సంబంధం లేకుండా ఆదరించే కాలం నడుస్తుంది ఇప్పుడు. పోనీ ఈ విషయంలో సక్సెస్ అయినా చిరంజీవికి కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణతో సినిమా పాస్ అయిపోయేది. కానీ అక్కడ కూడా ఆచార్య విఫలం అయ్యాడు. ఈ సినిమా కథ ధర్మస్థలి, పాద ఘట్టం అనే రెండు కాల్పనిక ఊర్లలో జరుగుతుంది. వాటి చరిత్ర గురించి మహేష్ బాబుతో ఇప్పించిన వాయిస్ ఓవర్ కొంచెం గందరగోళంగా ఉంది.
బ్యాక్‌డ్రాప్ కొంచెం...
ఇక ప్రధాన కథ విషయానికి వస్తే... మైనింగ్ అక్రమాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవలే వచ్చిన అఖండ, కేజీయఫ్ సిరీస్ కూడా మైనింగ్ నేపథ్యంలో వచ్చినవే. ఆచార్య చూస్తున్నంత సేపు అక్కడక్కడ అఖండ ఛాయలు కూడా కనిపిస్తాయి.
కథ ఎలా ఉన్నా కథనం బాగుంటే సినిమాలు పాస్ అయిపోతాయి. కానీ ఆచార్యలో కథనం కూడా 80లు, 90ల నాటి సినిమాల స్క్రీన్‌ప్లేలా ఉండటం పెద్ద మైనస్. సినిమాలో ఎక్కడ ఒక్క హై పాయింట్ కూడా కనిపించదు. ద్వితీయార్థంలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి చేసే ఫైట్ మాస్‌ను మెప్పించేలా ఉన్నప్పటికీ... అప్పటికే సమయం మించిపోయింది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే కొరటాల సినిమాల్లోనే మోస్ట్ వయొలెంట్ బ్లాక్.
మణిశర్మ అంటేనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు పెట్టింది పేరు. కానీ ఈ సినిమాలో రీ-రికార్డింగ్ వింటే అసలు మణిశర్మేనా రికార్డింగ్ చేసింది అనిపిస్తుంది. సెట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇక విలన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వీరు అంత స్ట్రాంగ్‌గా కూడా కనిపించరు.
ఆచార్య తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంతో ‘భోళా శంకర్’, మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో మెగాస్టార్ నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీళ్లు ముగ్గురికీ పెద్దగా క్రేజ్ లేదు కాబట్టి ఈ సినిమాలకు ఉన్న ఒకే ఒక్క క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్ మెగాస్టారే. వీటితో ఆయన బౌన్స్‌బ్యాక్ అవ్వాలని కోరుకుందాం.