కరాటే కళ్యాణికి షాకిచ్చిన ‘మా’ - షోకాజ్ నోటీసులు జారీ
ప్రముఖ నటి కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ తరపు నుంచి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘన కింద మా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు కరాటే కళ్యాణికి నోటీసులు జారీ చేశారు.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీనటి కరాటే కళ్యాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలపై తగిన వివరణ ఇవ్వాలని కోరింది. లేకపోతే ఆమెపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ వద్దా సుమారు 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ విగ్రహ ఆవిష్కరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు.
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటాం
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను కళ్యాణి తప్పు పట్టింది. అంతేకాదు దీనిపై యాదవ సంఘాలు, హిందూ సంఘాలతో కలిసి ఆమె పోరాటం కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి ఊహించని షాక్ తగిలింది. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ జారీ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారిపై చేసిన కామెంట్స్ కి వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలకు క్రమశిక్షణ ఉల్లంఘన మా అసోసియేషన్ తరఫు నుంచి మంచు విష్ణు ఆమెకు స్వయంగా నోటీసులు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో ఆమె తగిన వివరణ ఇవ్వాలని కోరారు.
'మా' నుండి ఫోన్ కాల్ వచ్చిన మాట నిజమే - కరాటే కల్యాణి
ఇక కరాటే కళ్యాణి సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ని కొందరు నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. ఆమె ఇలా మాట్లాడడం ఏమాత్రం సరి కాదని చెబుతున్నారు. కాగా కరాటే కళ్యాణి తాజాగా తనకు మా అసోసియేషన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ పై స్పందిస్తూ.. "మా అసోసియేషన్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమే. ఫోన్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు దేవుడు లాంటి వ్యక్తి. ఆయన విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం సరైనది కాదని అన్నారు. దానికి నేను, ఎన్టీఆర్ గారంటే నాకు గౌరవం, భక్తి ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మాత్రమే నేను తప్పబడుతున్నాను. అయితే నేను చెప్పింది వాళ్లకి అర్థమైనప్పటికీ మా అసోసియేషన్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉంటాయని ‘మా’ నుంచి షోకాజ్ నోటీసులు వస్తాయని చెప్పారు. దానికి నేను వివరణ ఇచ్చిన తర్వాతే ఏ విషయం చెప్తామన్నారు" అంటూ కరాటే కళ్యాణి తెలిపారు.
Read Also: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!