Karthikeya 2 Release Date : మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కార్తికేయ 2' విడుదల ఒక్క రోజు వాయిదా పడింది.
'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) విడుదల ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. దీనికి కారణం ఇండస్ట్రీలో కొంత మంది! ఇతర సినిమాలు ఉండటంతో థియేటర్లు ఇవ్వమని చెప్పడంతో వాయిదా వేసుకోక తప్పలేదు. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వమని చెప్పినప్పుడు బాధ పడ్డానని, కన్నీళ్లు పెట్టుకున్నానని ఇటీవల నిఖిల్ (Nikhil Siddharth) ఆవేదన వ్యక్తం చేశారు కూడా! ఇప్పుడు మరోసారి 'కార్తికేయ 2' వాయిదా పడింది. అయితే... ఈసారి ఒక్క రోజు మాత్రమే కావడం గమనార్హం.
ఆగస్టు 13న 'కార్తికేయ 2' విడుదల
జూలై నెలాఖరున విడుదల కావాల్సిన 'కార్తికేయ 2' వాయిదాలు పడి పడి ఆగస్టు 12న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రతి వారం ఏదో ఒక సినిమాతో పోటీ పడక తప్పదు కాబట్టి ఆ రోజున వస్తున్నామని నిఖిల్ చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 12న కూడా 'కార్తికేయ 2' రావడం లేదు. మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు. ఒక్క రోజు ఆలస్యంగా ఆగస్టు 13న సినిమా (Karthikeya 2 Movie Release On Aug 13th) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం వెల్లడించింది.
ఆగస్టు 6న 'కార్తికేయ 2' ట్రైలర్
ఆగస్టు రెండో వారంలో 'కార్తికేయ 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. అంతకు ముందు... తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 6న 'కార్తికేయ 2' ట్రైలర్ విడుదల కానుంది.
'కార్తికేయ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad), అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : 'కార్తికేయ 2'కు థియేటర్లు ఇవ్వలేదు - కన్నీళ్లు పెట్టుకున్న హీరో నిఖిల్
ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ.
Also Read : ఎప్పుడూ విజయం కంటెంట్‌దే - నిఖిల్ 'కార్తికేయ 2'కు విష్ణు మంచు సపోర్ట్