Nikhil Siddharth Controversial Comments: 'కార్తికేయ 2'కు థియేటర్లు ఇవ్వలేదు - కన్నీళ్లు పెట్టుకున్న హీరో నిఖిల్
యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'కార్తికేయ - 2' ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా 'కార్తికేయ'కు సీక్వెల్ ఇది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఇటువంటి సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరిగిందని నిఖిల్ అన్నారు.
రెండుసార్లు వాయిదా పడిన 'కార్తికేయ 2'
'కార్తికేయ 2' చిత్రాన్ని ముందుగా జూలై 22న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ రోజు అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ' విడుదల ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత జూలై 29న విడుదల చేయాలని భావించారు. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' కోసం వాయిదా వేశారు. నిజానికి, ఆయా సినిమాలతో పాటు 'కార్తికేయ 2'ను విడుదల చేయాలనుకున్నప్పటికీ... సరైన సంఖ్యలో థియేటర్లు లభించని కారణంగా వాయిదా వేశారని టాక్. లేటెస్టుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి పరోక్షంగా నిఖిల్ మాట్లాడారు.
బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టే మాకు ఇలా జరిగింది: నిఖిల్
తమ సినిమాకు, తమకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టే ఇలా జరిగిందని హీరో నిఖిల్ అన్నారు. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వమని చెప్పినప్పుడు చాలా బాధపడ్డానని, జీవితంలో తొలిసారి ఏడ్చానంటూ ఆయన బాధ పడ్డారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆగస్టు 5న నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', 12న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఆగస్టు 12 నుంచి కూడా 'కార్తికేయ 2'ను వెనక్కి జరపాలని తమకు చెప్పారని, దాంతో చాలా బాధ పడ్డానని నిఖిల్ అన్నారు.
ఏదొక సినిమాతో పోటీ పడక తప్పదు
ప్రస్తుత తరుణంలో ఏదో ఒక సినిమాతో క్లాష్ అవ్వాల్సిన పరిస్థితి ఉందని, అటువంటి అప్పుడు అసలు వాయిదా వేసుకోమనడం ఏంటి? అందులోనూ కేవలం తమ సినిమానే వాయిదా వేసుకోమనడం ఏంటి? అని నిఖిల్ ప్రశ్నించారు. 'కార్తికేయ 2' నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బలంగా నిలబడటం వల్లే ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తున్నామని, ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నట్టు నిఖిల్ తెలిపారు.
Also Read : కమెడియన్ చేత అమ్మాయికి తాళి కట్టించిన సుమ - తర్వాత యూట్యూబ్‌లో వీడియో డిలీట్
'కార్తికేయ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

