Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి కొత్త చిక్కులు, అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేనా?
కంగనా రనౌత్ నటించి, తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సిక్కు మత సంస్థలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఆందోళన మొదలు పెట్టాయి.
Emergency Movie In Trouble: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను నిషేధించాలంటూ పలు సిక్కు సంస్థలు ఆందోళన బాటపట్టాయి. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC), అఖల్ తఖ్త్ సంస్థలు ఈ సినిమా విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయన్నారు. ఈ మూవీ రిలీజ్ అయితే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని SGPC చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి వెల్లడించారు. సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘ఎమర్జెన్సీ’ని బ్యాన్ చేయాలన్న ఎంపీ సరబ్ జిత్ సింగ్
కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాను కచ్చితంగా నిషేధించాల్సిందేనని ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సినిమా సిక్కులను తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ చిత్రం విడుదలైతే శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. “కంగనా సినిమా ‘ఎమర్జెన్సీ’లో సిక్కులను తప్పుగా చూపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వల్ల సమాజంలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సిక్కులను వేర్పాటువాదులుగా, ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దేశంలోని సిక్కులపై విద్వేషాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ సినిమాపై వెంటనే దృష్టి పెట్టాలి. ఈ సినిమా విడుదలను ఆపాలి. లేదంటే దేశం కోసం ఎంతో త్యాగం చేసిన సిక్కులపై దుష్ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. సిక్కులు చేసిన దేశ సేవను చూపించకుండా, వారిపై చెడును ప్రచారం చేయడం మంచిది కాదు. సిక్కులను అగౌరవ పరిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు” అని సరబ్ జిత్ హెచ్చరించారు.
ఇందిరాను చంపిన బియాంత్ సింగ్ కొడుకే సరబ్ జిత్
ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఇద్దరు బాడీగార్డులు కాల్చి చంపారు. వారిలో ఒకరు బియాంత్ సింగ్. ఆయన కొడుకే ఈ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా. సినిమాలో సిక్కులను తప్పుగా చూపించినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ విడుదల
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్ 6న విడుదలకు రెడీ కానుంది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ భారత్ లో ఎమర్జెన్సీ విధించడం, ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న రాజకీయ ఇబ్బందులు, చివరకు సిక్కుల చేతిలో ఇందిరా చనిపోవడం ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీగా కంగనా నటిస్తున్నది. అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రను శ్రేయాస్ తల్పాడే పోషిస్తుండగా, జయప్రకాష్ నారాయణ్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ పాత్రలో దివంగత నటుడు సతీష్ కౌశిక్ కనిపించారు.