Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Balagam Mogilaiah passed away: గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న 'బలగం' మొగిలయ్య ఈరోజు ఉదయం కన్నుమూశారు.
జానపద కళాకారుడు, 'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. దీంతో పలువురు ప్రముఖులు, మూవీ లవర్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
'బలగం' సినిమా డైరెక్టర్ సంతాపం
మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లాలోని, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న దుగ్గొండి. మొగులయ్య తన భార్య కొమరమ్మతో కలిసి బుర్రకథలు చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ దంపతులకు పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా అబ్బిన ఈ బుర్రకథ కళను ప్రేక్షకుల ముందు ప్రదర్శించడమే జీవనాధారం. మొగిలయ్య, కొమరమ్మ దంపతులు ఇప్పటిదాకా వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల వంటి జిల్లాలో బుర్ర కథలు చెప్పారు. దానిపై వచ్చిన ఆదాయం తోనే ఇన్నాళ్లు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే ఈ దంపతులు 'బలగం' సినిమాలో అవకాశం రాగా, క్లైమాక్స్ లో పాడిన పాట అందరినీ ఎమోషనల్ చేసింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ విలువలను 'బలగం' సినిమాలో డైరెక్టర్ వేణు యెల్దండి కండ్లకు కట్టినట్టు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మెయిన్ హైలెట్ ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య పాడిన క్లైమాక్స్ పాట. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, మొగిలయ్య పాడిన ఆ పాట మరో ఎత్తు. ప్రేక్షకులకు సినిమా అంతగా కనెక్ట్ కావడానికి ఈ పాటే కారణం. ఈ పాటతో మొదలయ్యకు ఒక్కసారిగా మంచి గుర్తింపు లభించింది. దీంతో మొగులయ్య దంపతులు సినీ లోకానికి పరిచయం అయ్యారు. ఇక తాజాగా మొగిలయ్య ఇక లేరనే విషయం తెలిసిన 'బలగం' సినిమా డైరెక్టర్ వేణు యెల్దండితో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులు సంతాపాన్ని తెలియజేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు మొగిలయ్యకు నివాళులు అర్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మొగులయ్యకు అనారోగ్యం
గత కొంతకాలం నుంచి మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉంచి మొగులయ్యకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారానికి రెండుసార్లు ఆయనకు డయాలసిస్ జరుగుతుండగా, ఇటీవలే గుండె సమస్యలు కూడా తలెత్తాయని మొగులయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో, గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Also Read: మెడలో మంగళ సూత్రంతోనే కీర్తి సురేష్ - బాలీవుడ్ సినిమా ప్రమోషన్‌లోనూ ట్రెడిషనల్ వదల్లేదు
ఇక మొగిలయ్య బ్రతికుండగా ఆయన వైద్య ఖర్చులకు 'బలగం' సినిమా డైరెక్టర్ వేణు యెల్దండితో పాటు చిత్ర యూనిట్ ఆర్థిక సహాయాన్ని అందించింది. 'బలగం' టీం మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందించి, మొగిలయ్య కుటుంబాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. అయితే ఇంత చేసినప్పటికీ మొగిలయ్య తాజాగా అనారోగ్యంతో కన్నుమూయడం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
Also Read: బెయిల్‌పై బయటకొచ్చిన పవిత్ర గౌడ... ఆ గుడిలో దర్శన్ పేరు మీద ప్రత్యేక పూజలు - జనాల రియాక్షన్ ఏమిటంటే?