Jawan Film: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!
త్వరలో ఓటీటీలోకి రాబోతున్న ‘జవాన్’ సినిమాకు దర్శకుడు కొత్త మెరుగులు దిద్దుతున్నారు. థియేట్రికల్ వెర్షన్ లో లేని కొత్త సీన్లు యాడ్ చేసి ఓటీటీలోకి వదలబోతున్నారు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యాయి.
ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరోవైపు ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అటు ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదంటే నవంబర్ లో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
కొత్త సీన్లతో ‘జవాన్’ ఓటీటీ వెర్షన్
తాజాగా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సరైన నిడివి, ఎమోషన్స్ తో ‘జవాన్’ను థియేటర్లలో విడుదల చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘రానున్న నాలుగు నెలలు మా అబ్బాయితోనే టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే, దాదాపు మూడున్నరేళ్ల నుంచి ‘జవాన్’ వర్క్ లోనే ఉన్నా. ఈ సినిమా తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరేలా సినిమా చేయాలి. కాబట్టి, కాస్త సమయం తీసుకుని తదుపరి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తా’’ అని ఆయన తెలిపారు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది. ప్రియమణి, సన్యా మల్హోత్రా సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు.
బన్నీతో అట్లీ మూవీ
ఇక అట్లీ బన్నీతో తదుపరి చిత్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అట్లీ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటికే తాను బన్నీకి కథ చెప్పినట్లు చెప్పారు. ప్రస్తుతం స్టోరీ గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందన్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. తాజాగా అనిరుధ్ ను బన్నీ పాటలు అడిగారు. దీంతో ఆయన తదుపరి చిత్రానికి అనిరుధ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial