Jacqueline Fernandez: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్... ఇప్పుడు ఫిక్స్... తెలుగు దర్శకుడితో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
Jacqueline Fernandez Telugu Movie: ప్రభాస్ 'సాహో'లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఐటమ్ సాంగ్ చేశారు. ఇప్పుడు తెలుగు దర్శకుడు తీయనున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ సినిమాల్లో నటించిన శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో'లో ఆవిడ ఐటమ్ సాంగ్ చేశారు. అదొక్కటే ఆమె చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కాదు... ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.
'వీరమల్లు'లో మిస్... ఇప్పుడు ఫిక్స్!
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పటికే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాల్సింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లో ఓ పాత్ర కోసం తొలుత ఆవిడ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆ క్యారెక్టర్ ఆమె దగ్గర నుంచి నర్గిస్ ఫక్రి, ఆ తర్వాత నోరా ఫతేహి దగ్గరకు వెళ్ళింది. 'హరిహర వీరమల్లు' పార్ట్ 2లో ఎవరో ఒక బాలీవుడ్ భామ నటించే అవకాశం ఉంది. అది పక్కన పెడితే... జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు జయ శంకర్ భారీ ఫిమేల్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు.
Also Read: మాట మీద నిలబడిన పవన్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్వీట్!
సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'పేపర్ బాయ్'తో వి జయ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత డీసెంట్ హిట్ 'అరి' తీశారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ జాక్వెలిన్ (V Jayashankar to direct Jacqueline Fernandez)కు యాక్షన్, సస్పెన్స్ అంశాలతో కూడిన ఇంటెన్స్ స్క్రిప్ట్ జయశంకర్ నేరేట్ చేశారట. కథతో పాటు అందులో తన క్యారెక్టర్, హై యాక్షన్ సీన్స్ చేసే అవకాశం ఉండటంతో జాక్వెలిన్ ఎగ్జైట్ అయ్యారట. నిజానికి జాక్వెలిన్ ప్రధాన పాత్రలో సినిమా చేయాలని ఏడాది నుంచి జయశంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికి కుదిరిందని సమాచారం.
త్వరలో సెట్స్ మీదకు యాక్షన్ థ్రిల్లర్!
ఇప్పటి వరకు చేసిన గ్లామర్ రోల్స్, హీరోయిన్ క్యారెక్టర్లతో కంపేర్ చేస్తే జయశంకర్ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్యారెక్టర్ కొత్తగా ఉందట. ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో జాక్వెలిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి జయశంకర్ సన్నాహాలు చేస్తున్నారు.





















