ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన జాతిరత్నం.. ‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ ప్రమోషన్స్ కోసం అమెరికా పయనమైన నవీన్ పోలిశెట్టి!
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నవీన్ యూఎస్ కు బయలుదేరారు.
భారతీయ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మన తెలుగు చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. దేశీయ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపని సినిమాలు సైతం అమెరికాలో సత్తా చాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభనతో రెండేళ్ల క్రితం మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ, ఇటీవల కాలంలో ట్రేడ్ మళ్ళీ పుంజుకుంది. తెలుగు చిత్రాలు ఎప్పటిలాగే యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే మన ఫిలిం మేకర్స్, హీరో హీరోయిన్లు ఒకప్పటి మాదిరిగానే అమెరికాకు వెళ్లి సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ ప్రమోషన్స్ కోసం యువ హీరో నవీన్ పోలిశెట్టి యూఎస్ కు పయనమయ్యారు.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ - ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన స్పెషల్ పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాన వేసుకొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ స్టేట్స్‌లో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
నవీన్ పోలిశెట్టి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ టూర్ నిర్వహించి MSMP సినిమాని విస్తృతంగా ప్రచారం చేసారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాలలో పర్యటించి, ప్రేక్షకులతో ముచ్చటించారు. సినిమా గురించిన విశేషాలను పంచుకుంటూ సినిమాకి కావాల్సిన బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓవర్ సీస్ లో తన చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని 'బిగ్ బాస్ తెలుగు 7' షో వేదికగా నవీన్ వెల్లడించారు.
Also Read: అప్పుడు మలయాళ స్టార్‌లను వణికించింది, ఇప్పుడు అనాథలకు అమ్మగా మారింది!
“మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి” సినిమా ప్రీమియర్స్ సెప్టెంబర్ 6న అమెరికాలో ప్రదర్శించబడనున్నాయి. డల్లాస్‌లో ప్రేక్షకులతో కలిసి నవీన్ పోలిశెట్టి తన చిత్రాన్ని వీక్షించనున్నారు. ఆ తర్వాత అతను చికాగో, వర్జీనియా, న్యూజెర్సీ, సీటెల్, బే ఏరియా, అట్లాంటాతో సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి సినిమాని ప్రచారం చేయాలని ప్లాన్ చేశాడు. గతంలో నవీన్ నటించిన 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' సినిమా యుఎస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. అలానే 'జాతిరత్నాలు' సినిమా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేసి టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ కు ఊపు తీసుకొచ్చింది. అప్పుడు ఈ మూవీ ప్రచారం కోసం అమెరికా వెళ్లిన యంగ్ హీరో.. ఇప్పుడు MSMP కోసం అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
ఇటీవల 'ఖుషి' సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ సమంత రూత్ ప్రభు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్స్ చేస్తే, రిలీజ్ కు ముందు సామ్ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లి అక్కడ ప్రచారం చేసింది. ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రమోషన్స్ కోసం నవీన్ యూఎస్ కి బయలుదేరారు. ఈ ధోరణి ఓవర్సీస్ మార్కెట్ ప్రాముఖ్యత ఏంటో తెలియజెప్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాలు యూఎస్ తో పాటుగా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. అందుకే గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి మన ఫిలిం మేకర్స్ ఫారిన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'చంద్రముఖి 2' ట్రైలర్: రజినీ స్వాగ్‌ను రాఘవ లారెన్స్ మ్యాచ్ చేయగలిగాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial