'చంద్రముఖి 2' ట్రైలర్: రజినీ స్వాగ్‌ను రాఘవ లారెన్స్ మ్యాచ్ చేయగలిగాడా?
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ యాక్షన్ మూవీ 'చంద్రముఖి 2'. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేసింది. పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇది 2005 లో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో రూపొందిన బ్లాక్ బస్టర్ 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్. దాదాపు 17 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
'చంద్రముఖి 2' ట్రైలర్ లోకి వెళ్తే, 'రాజాధి రాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక.. వేట్టయ రాజా' అంటూ రాఘవ లారెన్స్ ఎంట్రీతో ప్రారంభం అవుతుంది. 17 సంవత్సరాల క్రితం చంద్రముఖిని బంధించిన బంగ్లాలోకి ఒక ఫ్యామిలీ అడుగుపెడితే, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది లైట్ గా చూపించారు. చంద్రముఖి తన 200 ఏళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకుందా లేదా అనేది కథలో ప్రధానాంశం. ఒక్క వడివేలు తప్ప మొదటి భాగంలోని మిగతా ప్రధాన పాత్రధారులు ఎవరూ ఈ సీక్వెల్ లో కనిపించలేదు.
రాఘవ లారెన్స్ రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఒకరి మోడరన్ లుక్ కాగా.. మరొకటి ప్రతినాయకుడి ఛాయలు ఉండే వేట్టయ రాజా లుక్. ఒక పాత్ర స్టైల్ గా డ్యాన్సులు ఫైట్లు చేస్తూంటే, మరో పాత్ర కత్తి యుద్ధాలు చేస్తూ కనిపించింది. ఇక రాజ నర్తకిగా కంగనా రనౌత్ కనిపించింది. రెండు షాట్స్ కే పరిమితమైనా, స్క్రీన్ మీద అందంగా కనిపించింది. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. విఘ్నేష్, రవి మారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
మొదటి భాగం లాగానే ఈ సీక్వెల్‌లో కూడా మంచి కామెడీ, డ్రామా, యాక్షన్, రొమాన్స్ ఉంటాయని 'చంద్రముఖి 2' ట్రెయిలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కోర్ పాయింట్ అయిన హారర్ ను, థ్రిల్లింగ్ అంశాలను చూపించలేకపోయారు. వావ్ ఫ్యాక్టర్ ఏదీ లేకపోవడం, కొత్తగా ఆసక్తి కలిగించే ఎలిమెంట్ ఏదీ కనిపించకపోవడం నిరాశ కలిగించే విషయమే. కేవలం సినిమాలోని స్టార్ కాస్ట్ ను పరిచయం చేయటానికే ఈ రెండున్నర నిమిషాల వీడియో కట్ చేసినట్లు అనిపిస్తుంది. మెయిన్ గా చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్ కు ఇందులో స్పేస్ ఎక్కువ లేదు.
నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని భారీ స్థాయిలో 'చంద్రముఖి 2' సినిమాని రూపొందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా వుంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కానీ ట్రైలర్ లో ఆయన వర్క్ పెద్దగా కనిపించలేదు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. దీనికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా, ఆంటోనీ ఎడిటర్ గా పని చేశారు. రవి వర్మ, కమల్ కన్నన్, స్టంట్ శివ, ఓం ప్రకాశ్ కొరియోగ్రఫీ చేశారు.
ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, రజినీకాంత్ నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో ఆసక్తి నెలకొంది. కాకపోతే తలైవా, జ్యోతికల పాత్రల్లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారో, వాళ్ళని మ్యాచ్ చేస్తారో లేదో అనే డౌట్ మాత్రం అందరిలో వుంది. ఈ విషయంలో ఇప్పటికే కంపేరిజన్స్ మొదలైయ్యాయి. రజనీని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరని, ఆయన స్వాగ్‌ను మరిపించడం ఎవరితరం కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది పక్కా లారెన్స్ సినిమా అని, రజినీతో పోలికలు సరికాదని అంటున్నారు.
'చంద్రముఖి 2' చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 19న భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం రిలీజ్ చేయనున్నారు.
Also Read: షకీలా ఒక సోషల్ వర్కర్ - అప్పుడు మలయాళ స్టార్‌లను వణికించింది, ఇప్పుడు అనాథలకు అమ్మగా మారింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial