Teja Sajja: బ్రో షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. ఆయన మాకు టైమ్ ఇచ్చారు - జై పవర్ స్టార్: తేజ సజ్జా
HanuMan 100 Days Event: తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ తాజాగా థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.
Teja Sajja Speech At HanuMan 100 Days Event: సంక్రాంతి కానుకగా విడుదలయిన ‘హనుమాన్’ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా థియేటర్లలో 100 రోజులను కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. దాంతో పాటు హనుమాన్ జయంతి కూడా ఉండడంతో మూవీ టీమ్ ఒకప్పటి సత్యం థియేటర్‌లో ఒక స్పెషల్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాతో పాటు ఇతర మూవీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ‘హనుమాన్’ 100 డేస్ ఈవెంట్‌లో తేజ సజ్జా.. తను సినిమా టికెట్ల కోసం లైన్‌లో నిలబడిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతే కాకుండా తన అప్‌కమింగ్ మూవీ ‘మిరాయ్’ గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు.
అందరి సక్సెస్..
‘‘మామూలుగా అయితే ఇప్పటికే చాలాసార్లు మాట్లాడి ఉన్నాను కాబట్టి.. మాట్లాడి ఉండేవాడిని కాదు. కానీ ఇక్కడే సత్యం థియేటర్‌లో 100 రోజుల ఆడిన ఎన్నో సినిమాలను లైన్‌లో నిలబడి టికెట్లు తీసుకొని చూశాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నా కూడా ఇక్కడికే వచ్చి సినిమాలు చూసేవాళ్లం. అలాంటి ప్లేస్‌లో హనుమాన్ 100 రోజుల ఈవెంట్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈరోజు ఉదయమే నాకు చాలా దగ్గర మనిషి ఒకరు.. ఈ జనరేషన్‌లో 100 రోజుల సినిమా నీ ఒక్కడికే ఉంది అనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు.. మీ అందరి 100 రోజులు’’ అంటూ ‘హనుమాన్’ మూవీని సూపర్ సక్సెస్‌ఫుల్ చేసినందుకు సక్సెస్ క్రెడిట్ అంతా ఆడియన్స్‌కే ఇచ్చి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు తేజ.
ఆయన వల్లే స్థాయి పెరిగింది..
‘‘మా టీమ్‌లో ప్రతీ ఒక్కరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను. కానీ సముద్రఖని గురించి మాత్రం ప్రతీసారి మిస్ అయ్యాను. ఈసారి మిస్ అవ్వను. చాలా గట్టిగా చెప్తాను. ఆయన మా సినిమాలోకి వచ్చి దాని స్థాయిని అలా పెంచేశారు. ఆయనకు ఉన్న కమిట్మెంట్‌కు చాలా థ్యాంక్స్. అది మాకు చాలా పెద్ద విషయం. ఆయన బ్రో షూటింగ్‌లో బిజీగా ఉన్నా మాకోసం టైమ్ ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్’’ అంటూ మధ్యలో జై పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు తేజ సజ్జా. ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనకు సక్సెస్ ఈజీగా రాలేదని, గట్స్ ఉన్నవాడికే హిట్స్ అంటూ ప్రశంసించాడు.
కష్టపడతాను..
‘హనుమాన్’ తర్వాత ‘మిరాయ్’ అనే మరో సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ సజ్జా. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ నటిస్తున్న ‘మిరాయ్’కు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. అయితే ‘హనుమాన్’ 100 డేస్ ఈవెంట్‌కు వచ్చిన తేజ ఫ్యాన్స్ సైతం ‘మిరాయ్’ అప్డేట్ ఇవ్వమని కోరారు. మొన్నే కదా టీజర్ రిలీజ్ చేశాం అని చెప్తూ నవ్వాడు తేజ. అంతే కాకుండా కష్టపడడం మాత్రమే తన చేతుల్లో ఉందని, కచ్చితంగా సినిమాను కష్టపడి చేసి నిజాయితీగా అందరి ముందుకు తీసుకొస్తానని చెప్పాడు. చివరిగా ‘జై శ్రీరామ్’ అంటూ తన స్పీచ్‌ను ముగించాడు ఈ యంగ్ హీరో.