Nayanthara look in Jawan: షారుక్ 'జవాన్' నుంచి లీకైన నయనతార లుక్!
తమిళ్ దర్శకుడు అట్లీ, షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమా నుంచి హీరోయిన్ నయనతార లుక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో 'జవాన్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో తలపతి విజయ్‌తో వరుస సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ మొదటిసారి షారుక్ ఖాన్ తో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై నార్త్‌తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మొట్టమొదటిసారి షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ టీం ఈ నెల నుంచి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ముందుగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమోషన్ స్టార్ట్ అవ్వకముందే 'జవాన్' నుంచి నయనతార లుక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నయనతార తన గ్లామర్ తో అదరగొట్టేసింది. తాజాగా లీకైన లుక్ లో నయనతార రెడ్ షర్ట్ అండ్ పింక్ కలర్ సూట్ ధరించి కనిపించింది. అంతేకాకుండా కర్లీ హెయిర్ తో ఓ మీటింగ్లో కూర్చున్నట్లు ఈ లుక్ లో కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియా అంతా వైరల్ గా మారుతుంది. అయితే సోషల్ మీడియాలో లీకైన నయనతార లుక్ జవాన్ లోదేనా? కాదా? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 'జవాన్' సినిమాతోనే బాలీవుడ్ లో డైరెక్ట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
Leaked, NAYANTHARA's first look from #Jawan #Nayanthara #JawanTrailer pic.twitter.com/4OkQbu1Ljo
— Nayanthara Fan Account (@NayanthaaraF) July 6, 2023
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సానియా మల్హోత్ర, ప్రియమణి, సునీల్ గ్రోవర్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గెస్ట్ రోల్ చేస్తుంది. ఇక 'జవాన్' ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ట్విట్టర్లో #jawaan Trailer హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్ల మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలోనే 'జవాన్' ట్రైలర్ ని జూలై 12న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ ట్రైలర్ ని ఒకేసారి విడుదల చేయబోతున్నారట. దీంతో షారుక్ ఫ్యాన్స్ 'జవాన్' ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
కాగా సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు షారుక్ ఖాన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక 'పఠాన్' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత షారుక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'జవాన్' పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను 'జవాన్' అందుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Also Read : ప్రాజెక్ట్-K బిగ్ అప్‌డేట్, అంతర్జాతీయ వేదికపై టైటిల్ రివీల్ - ఎక్కడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial