Harshaali Malhotra Interview: బాలకృష్ణతో నటించడం అదృష్టం... తెలుగులో వాళ్లిద్దరూ నా ఫేవరెట్- హర్షాలీ మల్హోత్రా ఇంటర్వ్యూ
Harshaali Malhotra On Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2'లో ఉత్తరాది అమ్మాయి హర్షాలీ మల్హోత్రా నటించింది. సినిమా గురించి, తెలుగులో తనకు నచ్చిన హీరోల గురించి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' గుర్తుందా? అందులో చిన్నారి గుర్తుందా? ఆమె పేరు హర్షాలీ మల్హోత్రా. ఆ సినిమా పదేళ్ల క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దది అయ్యింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజా సినిమా 'అఖండ 2 తాండవం'లో నటించింది. బాలయ్య కుమార్తెగా కనిపించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం, ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. డిసెంబర్ 5న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హర్షాలీ మల్హోత్రా సినిమా గురించి చెప్పిన విశేషాలు...
పదేళ్ల తర్వాత థియేటర్లలోకి!
సల్మాన్ 'భజరంగీ భాయిజాన్' చేశాక చదువు మీద దృష్టి పెట్టాను. మధ్యలో కథక్ నేర్చుకున్నా. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ నేను థియేటర్లలోకి వస్తున్నాను. అందుకని, చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. 'అఖండ 2'లో జనని క్యారెక్టర్ చేశా. ఆ అమ్మాయి చాలా స్వీట్ & కేరింగ్. ఆమెకు అఖండ ఆశీర్వాదం ఉంటుంది. జననికి జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురైనా అఖండ వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి.
బాలకృష్ణ గారి సినిమాలు చూశా!
'భజరంగీ భాయిజాన్' తర్వాత చాలా పాత్రలు వచ్చాయి. అయితే మంచి రోల్ కోసం నేను ఎదురు చూశా. ఆ సమయంలో 'అఖండ 2' వచ్చింది. లెజెండరీ నందమూరి బాలకృష్ణ గారితో నటించడం గొప్ప అవకాశం. ఇటువంటి సినిమా కోసం నేను ఎదురు చూశా. బాలకృష్ణ గారి 'భగవత్ కేసరి', 'వీర సింహా రెడ్డి', 'డాకూ మహారాజ్', 'అఖండ' సహా ఎన్నో సినిమాలు చూశా. నాకు అఖండ అద్భుతంగా అనిపించింది. బోయపాటి గారి డైరెక్షన్ అయితే అమేజింగ్. అందుకని, 'అఖండ 2' రాగానే ఓకే చెప్పేశా.
Also Read: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
బాలకృష్ణ ఎంతో ప్రోత్సహించారు!
బాలకృష్ణ గారు వెరీ కూల్ పర్సన్. అటువంటి లెజెండరీ నటుడితో కలిసి సినిమా చేయడం నా అదృష్టం. ఆయనతో నటించడానికి మొదటి చాలా నెర్వస్ ఫీలయ్యా. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. బాలకృష్ణ గారు వెరీ ఎనర్జిటిక్, అన్ స్టాపబుల్ యాక్టర్. ఈ సినిమా కోసం మైనస్ డిగ్రీస్ లొకేషన్లలో షూట్ చేశాం. అంత చలి ప్రదేశాల్లో షూటింగ్ చేయడం వెరీ ఛాలెంజింగ్. ఇందులో యాక్షన్ స్టంట్స్ చేశా. నా రెండో సినిమా తెలుగు సినిమా కావడం, అదీ లెజెండరీ కథానాయకుడితో నటించడం అద్భుతమైన అనుభూతి.
ప్రభాస్, అల్లు అర్జున్ అంటే ఇష్టం!
తెలుగులో బాలయ్య గారు కాకుండా అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్ళతో నటించాలని ఉంది. సంజయ్ లీలా బన్సాలీ గారి సినిమాలో హీరోయిన్లను చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయనతో పాటు అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని ఉంది.





















