Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Prasad Behara arrested In Hyderabad: తోటి నటిని వేధించిన కేసులో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.
Actor Prasad Behara arrested : హైదరాబాద్: ఈ మధ్య యూట్యూబ్, సినీ సెలబ్రిటీలపై కేసులు పెరిగిపోతున్నాయి. అందులో చాలా వరకు లైంగిక వేధింపులు, సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా అన్యాయం చేశారనే అరోపణలతో ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఫేమస్ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి నటిని వేధించిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నటుడ్ని అరెస్టు చేశారు. మణికొండకు చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు ప్రసాద్ బెహరాపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.
అసలేం జరిగింది..
ప్రసాద్ బెహరా ఓ ఫేమస్ యూట్యూబర్. తన నటన, కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులు ఇష్టపడేవారు. పెళ్లివారమండీ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో మరికొన్ని సీజన్లు తీయగా అవి కూడా సక్సెస్ కావడంతో ప్రసాద్ బెహరా పేరు మార్మోగి పోయింది. ఇటీవల కమిటీ కుర్రాళ్లు అనే సినిమాలో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.
కొన్నిరోజుల కిందట ఓ వెబ్ సిరీస్ లో బాధితురాలు, ప్రసాద్ బెహరా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అతడు అందరి ముందు తనతో అసభ్యకంగా ప్రవర్తించాడని నటి తెలిపింది. ఇదేంటి అని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో తనను తిట్టాడని బాధితురాలు వాపోయింది. ఆపై డిసెంబర్ 11న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అందరి ముందు తనపై దాడి చేశాడని సైతం నటి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నటుడు ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రసాద్ బెహరాను చంచల్ గూడ జైలుకు తరలించారు.