Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Sandhya : సంధ్యాధియేటర్ తొక్కిసలాట కారణంగా కోమాలోకి వెళ్లిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అరవింద్ తెలుసుకున్నారు. కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్ గురించి డాక్టర్లతో మాట్లాడారు.
Allu Arvind visited Sritej at Kim Hospital: పుష్ప ది రూల్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్‌కిసలాటలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన బాలుడు శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రిలో రెండు వారాలుగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఆ పిల్లవాడ్ని కాపాడేందుకు వెంటిలేటర్ మీద పెట్టి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించింది.. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని తెలిపారు. అర్జున్ తరపున తాను ఆస్పత్రికి వచ్చానని అరవింద్ తెలిపారు.
అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించలేదని విమర్శలు
అల్లు అర్జున్ అరెస్టు ఘటన తర్వాత శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు మంగళవారం ...పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కూడా పరామర్శించారు. ఆ సమయంలో ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై విమర్శలు వచ్చాయి. వైద్య ఖర్చులన్నీ పెట్టుకుంటామని ప్రకటించారని అయినా ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అర్జున్ పరామర్శించకపోవడం కూడా వివాదాస్పదం అవుతోంది.
కేసు కోర్టులో ఉన్నందునే వెళ్లడం లేదన్న అర్జున్
ఈ అంశంంపై అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చారు. కేసు కోర్టులో ఉన్నందున న్యాయవాదులు ఆస్పత్రికి వెళ్లవద్దని సలహా ఇచ్చారని అందుకే రాలేకపోతున్నానని .. కానీ ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరూ శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లలేదు. కోమాలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజు రోజుకు దిగజారిపోతోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి జరగరానిది జరిగితే అల్లు అర్జున్ కు మరిన్ని సమస్యలు చుట్టుముడతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడ్ని పరామర్సించేందుకు అల్లు అరవింద్ రావడం ఆసక్తికరంగా మారింది.
సంధ్యా ధియేటర్ మూసివేతకు పోలీసుల నోటీసులు
ఈ ఘటన వ్యవహారంలో అల్లు అర్జున్ న్యాయవాది మొత్తం తప్పు పోలీసులదేనని హైకోర్టులో వాదించడంతో పోలీసులు కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. తాము అనుమతి ఇవ్వకపోయినా..అనుమతి అడిగినట్లుగా లెటర్ బయట పెట్టి సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులపై తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహిస్తున్నారు. తాము ఇచ్చిన రిప్లయ్ ను పోలీసులు లీక్ చేశారు.అందులో సినిమా యూనిట్ రావొద్నది పోలీసులు స్పష్టంగా చెప్పినట్లుగా ఉంది. మరో వైపు సంధ్యా ధియేటర్ మూసివేతకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.