Divya Bharti: దివ్య భారతి మరణం, మ్యారేజ్ మిస్టరీయే! మూడేళ్ళలో 30 ఏళ్ళకు సరిపడా ఫేమ్!
మూడేళ్ళ కెరీర్‌లో 30 ఏళ్ళకు సరిపడా ఫేమ్ సంపాదించిన కథానాయిక ఎవరైనా ఉన్నారంటే దివ్య భారతి అని చెప్పాలి. ఆమె మరణం, మ్యారేజ్... ప్రతిదీ మిస్టరీ! దివ్య భారతి వర్ధంతి సందర్భంగా...
Divya Bharti Death Anniversary: దివ్య భారతి ముంబై అమ్మాయి. కానీ, తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయిగా ఆమెను ఆదరించారు. దివ్య భారతి కథానాయికగా నటించిన సినిమాల సంఖ్య తక్కువే. కథానాయికగా కొనసాగిన సమయమూ తక్కువే. మూడంటే మూడేళ్లు మాత్రమే ఆమె సినిమాలు చేశారు. కానీ, 30 ఏళ్లకు సరిపడా ఫేమ్ సంపాదించుకున్నారు. నేడు (ఏప్రిల్ 5) దివ్య భారతి వర్ధంతి. వచ్చే ఏడాది ఇదే రోజుకు ఆమె మరణించి 30 ఏళ్ళు అవుతుంది.
వెంకటేష్ 'బొబ్బిలి రాజా'తో దివ్య భారతి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీ అల్లుడు', 'ధర్మ క్షేత్రం', 'చిట్టెమ్మ మొగుడు' సినిమాలు చేశారు. తెలుగు తక్కువ సినిమాలు చేసినా... అందులో విజయాల శాతం ఎక్కువ. హిందీలోనూ దివ్య భారతి సక్సెస్ రేట్ ఎక్కువ. అయితే... ఆమె అనూహ్య మరణం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఆమెను చాలా మంది ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారంటే... ఆమె క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
దివ్య భారతి మరణం చాలా మందికి ఓ మిస్టరీ. అప్పట్లో పలు కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే... చివరకు పోలీసులు తేల్చిందేంటంటే? ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి పడటంతో మరణించారని! ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు ఆమె నివాసం ఉండేవారు. అక్కడ బాల్కనీ నుంచి కిందకు పడ్డారు. దాంతో చాలా మందిలో అనుమానాలు నెలకొన్నాయి. దివ్య భారతి మరణమే కాదు, మ్యారేజ్ కూడా మిస్టరీ. కథానాయికగా కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు హిందీ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాను పెళ్లి చేసుకున్నారు. తొలుత ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. కన్నతండ్రికి కూడా ఆమె చెప్పలేదు. దాంతో సాజిద్ మీద కొందరు ఆరోపణలు చేశారు. ఆయనపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే... దివ్య భారతి మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు ఇద్దర్నీ ఆయనే చూసుకున్నారు.
దివ్య భారతి తండ్రి ఒకానొక సమయంలో తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు. అలాగే, ఆమెది మర్డర్ కూడా కాదన్నారు. డిప్రెషన్‌లో మందు తాగి బాల్కనీ నుంచి దూకినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. "అరగంటలో ఎంత తాగుతారు? మా అమ్మాయి డిప్రెషన్‌లో లేదు. బాల్కనీ అంచున కూర్చుని ఉంది. బ్యాలన్స్ తప్పి కిందకు పడింది. ప్రమాదవశాత్తూ అలా జరిగింది. ప్రతిరోజూ కింద కార్లు ఉండేవి. ఆ రోజు ఒక్కటి కూడా లేదు. దాంతో నేరుగా గ్రౌండ్ మీద పడింది. అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లాట్స్‌కు గ్రిల్స్ ఉన్నాయి. తన ఫ్లాట్‌కు తప్ప" అని దివ్య భారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి చెప్పారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' మూడు సార్లు చూశా! తెలుగులో నా ఫేవరేట్ హీరో ఎవరంటే? - సయీ మంజ్రేకర్ ఇంటర్వ్యూ
దివ్య భారతి మరణించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్ళు. పదహారు ఏళ్ళకు కథానాయికగా తెరంగేట్రం చేయడం, మూడేళ్ళలో 20 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మరణించే సమయానికి దివ్య భారతి చేతిలో పది సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు ఆగిపోతే... మిగతా సినిమాల్లో శ్రీదేవి, రవీనా టాండన్, కాజోల్, జుహీ చావ్లా తదితరులకు అవకాశాలు వచ్చాయి.
Also Read: 'నాటు నాటు' పాటకు రాజమౌళి స్టెప్పేస్తే? ఎన్టీఆర్‌కు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటే?