Karthik Dandu: సాయి ధరమ్ తేజ్ మాట రాక ఇబ్బంది పడ్డారు: ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు
‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. విడుదల అయిన తొలి రోజుల్లోనే భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ ఇలా అన్నీ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మూవీ ఇదే. అయితే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనటంతో మొదట్లో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ దండు ఈ విషయాల గురించి చెప్పుకొచ్చారు.
షూటింగ్ కు రెండ్రోజుల ముందు యాక్సిడెంట్ అయింది: కార్తీక్ దండు
దర్శకుడు కార్తీక్ దండు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరూపాక్ష’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలుకావాల్సి ఉందని చెప్పారు కార్తీక్. అప్పటికే సాయి ధరమ్ తేజ్ కు కథ అంతా చెప్పి ఓకే అయ్యాక తాము షూటింగ్ ఏర్పాట్లలో ఉన్నామని అన్నారు. షూటింగ్ రెండ్రోజుల్లో మొదలు కావాల్సి ఉండగా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిందనే వార్త తెలిసిందని చెప్పారు. దీంతో తాను షాక్ కు గురయ్యానని అన్నారు. అప్పటికే షూటింగ్ కు సంబంధించిన సెట్స్ అన్నీ వేసేశామని, సడెన్ గా అలా జరగడంతో అంతా బ్లాక్ అయిపోయినట్టు అనిపించిందని చెప్పారు.
మొదట్లో మాట రాక ఇబ్బంది పడ్డారు..
సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 22 రోజులు ఆసుపత్రిలో ఉంచారని, తర్వాతే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారని అన్నారు. తర్వాత ఆయన్ను చూడటానికి ఇంటికి వెళ్లామని, అన్నిరోజులు ఫుడ్ లేకపోవడం వలన ఆయన చాలా వీక్ అయిపోయారని అన్నారు. ఆయన పరిస్థితి చూసి కోలుకోవడానికి ఆరు నెలలు అయినా పడుతుందని అనుకున్నామని.. కానీ ఆయన మూడు నెలల్లోనే కోలుకొని షూటింగ్ కు రెడీ చెప్పారని చెప్పారు. అయితే షూటింగ్ మొదట్లో డైలాగ్స్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారని, ఒక్కో అక్షరం కూడబలుక్కొని మాట్లాడేవారని చెప్పారు. అయితే ఆయన సమస్యలను ఆయనే పరిష్కరించుకొని నాలుగో రోజు నుంచి నార్మల్ గా మారిపోయారని అన్నారు.
నైట్ షూటింగ్ లలో చాలా కష్టపడ్డారు
‘విరూపాక్ష’ సినిమా దాదాపు 70 శాతం అంతా రాత్రి పూటే జరిగే సన్నివేశాలు ఉంటాయని అన్నారు దర్శకుడు కార్తీక్. అందుకే సినిమాలో రాత్రి పూట జరిగే సన్నివేశాలను నిజంగానే రాత్రి పూటే తీశామని, ప్రేక్షకులకు ఆ విజువల్ ట్రీట్ ఇద్దామనే అలా చేశామని అన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ అప్పటికే మెడికేషన్ మీద ఉన్నారని, రాత్రి పూట సన్నివేశాల్లో చేయగలరా లేదా అనే సందేహం ఉండేదని అన్నారు. ఆయన శారీరకంగా బలహీనంగా ఉన్నా షూటింగ్ కు ఇబ్బంది రాకూడదు అని అలాగే చేసేవారని అన్నారు. అలా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు దర్శకుడు కార్తీక్ దండు.