K Vasu Death : చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన, 'షిర్డీ సాయిబాబా మహత్యం' తీసిన దర్శకుడు ఇక లేరు
సీనియర్ దర్శకులు, వెండితెరపై విడుదలైన చిరంజీవి తొలి సినిమాకు దర్శకత్వం వహించిన కె. వాసు మరణించారు.
'పునాదిరాళ్ళు' కోసం మెగాస్టార్ చిరంజీవి తొలిసారి మేకప్ వేసుకున్నారు. అయితే, థియేటర్లలో విడుదలైన ఆయన తొలి సినిమా 'ప్రాణం ఖరీదు'. ఆ చిత్రానికి కె. వాసు (Director K Vasu) దర్శకత్వం వహించారు. కొంత కాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం కన్ను మూశారు.
ఇదీ కె. వాసు నేపథ్యం
ప్రఖ్యాత దర్శకుడు, దివంగత ప్రత్యగాత్మ (K Vasu Father Name) తనయుడు కె. వాసు. ఆయన బాబాయ్ కె. హేమాంబరధరరావు కూడా దర్శకుడే. ఇప్పుడు వాసు వయసు 72 ఏళ్ళు. జనవరి 7, 1951లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కొల్లి శ్రీనివాసరావు (Kolli Srinivasa Rao). కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
22 ఏళ్లకు దర్శకుడిగా తొలి సినిమా
సినిమా దర్శకుల కుటుంబంలో జన్మించడంతో స్వతహాగా వాసుకి దర్శకత్వంపై మక్కువ ఏర్పడింది. తండ్రి, బాబాయ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. కొన్ని రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన కూడా దర్శకుడు అయ్యారు. 22 ఏళ్ళ వయసులో 'ఆడపిల్లల తండ్రి' చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా తొలి సినిమాను ఆయనే సొంతంగా నిర్మించడం విశేషం. థియేటర్లలో విజయవంతంగా వంద రోజులు ప్రదర్శింపబడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
చిరంజీవితో ఐదు సినిమాలు...
'షిర్డీ సాయిబాబా మహత్యం'!
'ప్రాణం ఖరీదు' సినిమాతో చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన కె. వాసు... చిరుతో మొత్తం ఐదు సినిమాలు తీశారు. 'కోతల రాయుడు', 'ఒక్క చల్లని రాత్రి', 'ముద్దు ముచ్చట', 'దేవుడు మావయ్య', 'అమెరికా అల్లుడు', 'గోపాలరావు గారి అమ్మాయి' వంటి విజవంతమైన చిత్రాలకు కె. వాసు దర్శకత్వం వహించారు. అయితే, 'షిర్డీ సాయిబాబా మహత్యం' సినిమా ఆయనకు మరింత పేరు వచ్చింది. కెరీర్ మొత్తం మీద సుమారు 40 చిత్రాలకు కె. వాసు దర్శకత్వం వహించారు.
కృష్ణంరాజు, శ్రీదేవి, చంద్ర మోహన్, విజయ్ చందర్, సరిత తదితర తారలతో కె. వాసు పని చేశారు. సంగీత దర్శకులు చక్రవర్తి, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన తారలుగా 'పక్కింటి అమ్మాయి' అనే సినిమా కూడా తీశారు.
నేడు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
జూబ్లీ హిల్స్, హైదరాబాదులో గల మహా ప్రస్థానంలో ఈ రోజు కె. వాసు భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : నట సార్వభౌముడు దర్శకత్వం వహించిన సినిమాలివే - ఒక్కోటీ, ఒక్కో ఆణిముత్యం!
''సీనియర్ దర్శకులు కె. వాసు గారు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో చేసిన 'ప్రాణం ఖరీదు', 'తోడు దొంగలు', 'అల్లుళ్లు వస్తున్నారు', 'కోతల రాయుడు' చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. ''దర్శకులు శ్రీ కె. వాసు కన్ను మూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి గారు ముఖ్య పాత్రలో నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమా దర్శకులుగా శ్రీ వాసు గారిని మరచిపోలేం. చిరంజీవి గారు తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను ఆయన తెరకెక్కించారు. వాటిలో 'షిర్డీ సాయిబాబా మహత్యం' ప్రత్యేకమైనది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read : రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే - ఎన్టీఆర్‌ను దేవుడిని చేసిన పౌరాణిక చిత్రాలివే!