NTR 100th birth anniversary: రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే - ఎన్టీఆర్‌ను దేవుడిని చేసిన పౌరాణిక చిత్రాలివే!
రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా అలరించిన నందమూరి తారక రామారావు.. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించారు. చరిత్రలో నిలిచిపోయే పాత్రల్లో ఒదిగిపోయారు. పలు పౌరాణిక పాత్రల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు..
NTR Mythological Movies : తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు పాత్రలు పోషించారు నందమూరి తారక రామారావు (Senior NTR). అత్యుత్తమ నటులలో ఒకరిగా ప్రఖ్యాతి గాంచిన ఆయన పౌరాణిక పాత్రలు ధరిస్తే, అప్పట్లో ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు జరిగేవి. అద్భుతమైన ఆయన ఆహార్యం అందర్నీ ఆకట్టుకునేది మరి. ఎన్టీఆర్ కృష్ణుడిగా, రాముడిగా, అర్జునుడిగా, రావణుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ చాలా మందికి కృష్ణుడు, రాముడు అనగానే ఎన్టీఆరే గుర్తుకువస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన చేసిన పౌరాణిక సినిమాలు, పాత్రలు ఎంత ఘన విజయం సాధించాయో.
‘మాయాబజార్’లో శ్రీకృష్ణుని పాత్రలో..
'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ'గా ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్.. ‘మాయాబజార్’ సినిమాలో శ్రీకృష్ణుని పాత్రలో నటించారు. 1957లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికీ ‘మాయాబజార్’ సినిమాలోని శ్రీకృష్ణుడు పాత్రను అభిమానులు గుర్తుంచుకుంటారు. ఈ పాత్రతో ఎన్టీఆర్ కొన్ని కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇప్పటికీ టాలీవుడ్ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలుస్తోంది.
'లవ కుశ'లో రాముడి పాత్రలో..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాముడు అంటే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. 1963లో రిలీజైన 'లవ కుశ'లో ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించారు. దీంతో తెలుగువారి ఇంటి రాముడిగా మారారు. ఈ సినిమా తర్వాత నుంచే ప్రజలు ఎన్టీఆర్‌ని రాముడి పేరుతో పిలవడం, పూజించడం కూడా ప్రారంభించారు.
'నర్తనశాల'లో అర్జునుడు పాత్రలో..
శంకర్ కమలాకర కామేశ్వరరావు పౌరాణిక సృష్టి 'నర్తనశాల'లో సీనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నటనా నైపుణ్యాంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. అర్జునుడు.. బృహన్నల పాత్రను పోషించారు. అంతే కాదు సినిమా రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఎన్టీఆర్ బృహన్న పాత్రకు సైతం అనేక ప్రశంసలు లభించాయి.
'భూకైలాస్'లో రావణుని పాత్రలో..
సీనియర్ ఎన్టీఆర్ కేవలం హీరో పాత్రలే కాదు.. కొన్ని సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లోనూ మెప్పించారు. 'భూకైలాస్'లో ఎన్టీఆర్ రాక్షస-రాజు రావణుని పాత్రను పోషించారు. రావణుడి పాత్రలో ఆయన అలరించిన తీరును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
'దాన వీర శూర కర్ణ'లో మూడు పాత్రల్లో..
1977లో విడుదలైన 'దాన వీర శూర కర్ణ' సినిమాలో నందమూరి తారక రామారావు మూడు పాత్రల్లో నటించారు. కర్ణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు అనే మూడు భిన్న పౌరాణిక పాత్రల్లో నటించి రికార్డులో ఆయన పేరును సుస్థిరం చేసుకున్నారు. ఒక్క సినిమాలో మూడు పాత్రలు.. అది కూడా పౌరాణిక పాత్రలు కావడం ఎప్పటికీ ప్రశంసించదగ్గ విషయమనే చెప్పవచ్చు.
Read Also : యంగ్ టాలెంట్స్ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం - ఇక నిర్మాతగానూ బిజీ బిజీ