యంగ్ టాలెంట్స్ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం - ఇక నిర్మాతగానూ బిజీ బిజీ
కొత్త, యువ ప్రతిభను పరిచయం చేయడానికి, వారి టాలెంట్ ను ప్రోత్సహించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... కొత్త ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించారు. 'V మెగా పిక్చర్స్' అనే బ్యానర్ ను స్థాపించనున్నట్టు సమాచారం.
V Mega Pictures: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' భారీ విజయం తర్వాత గ్లోబల్ స్టార్‌డమ్‌ను సంపాదించిన హీరో రామ్ చరణ్.. మరోసారి తన టాలెంట్ ను చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన చెర్రీ.. గత కొన్ని రోజులుగా ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించాలని చర్చలు సాగిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గట్టు ప్రణాళికకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తనకు ఎంతో దగ్గర మిత్రుడితో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసినట్లు టాక్. దీనిపై ఇంకా అధికార ప్రకటన విడుదల కావల్సి ఉంది.
న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు V మెగా పిక్చర్స్?
కొత్త ప్రొడక్షన్ హౌస్ కోసం ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ లో ఒక భాగస్వామిగా ఉన్న నిర్మాత విక్రమ్‌తో కలిసి రామ్ చరణ్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. వీరి కలయికలో 'V మెగా పిక్చర్స్' అనే బ్యానర్ను స్థాపించనున్నారట. ఈ సంస్థ ద్వారా కొత్త రచయితలు, దర్శకుల నుంచి వచ్చే డిఫరెంట్ కథలను తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వెబ్ కంటెంట్ కూడా నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలిసింది.
రామ్ చరణ్ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త, యువ ప్రతిభను పరిచయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. చరణ్ ఎక్కువగా వినోదాత్మక కంటెంట్ కు ప్రాధాన్యమివ్వనున్నారని, చిన్న, పాన్-ఇండియా సినిమాల శ్రేణిని నిర్మించనున్నట్టు సమాచారం.
అఖిల్ సినిమాతో ప్రారంభం..
ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో మొదటగా నటించే హీరో అక్కినేని అఖిల్ అని తెలుస్తోంది. 'ఏజెంట్' లో ముందుగా రామ్ చరణే నటించాల్సింది. కానీ అతనికి డేట్స్ కుదరక అఖిల్ చేశాడని ఇటీవలే మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రామ్ చరణ్ కూడా ప్రమోషన్ చేసి అఖిల్ కు మంచి హిట్ దక్కాలని కోరుకున్నాడు. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ మంచి విజయాన్ని రాబట్టలేకపోయింది. అందుకని ఇప్పుడు అఖిల్ సినిమాతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్ట్ చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పొలిటికల్ డ్రామా ఫిల్మ్ 2024 వేసవిలో విడుదల కానుంది. ఆయన త్వరలోనే దర్శకుడు బుచ్చి బాబు సనా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాపై పని చేయనున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీనగర్‌లో జీ 20 సమ్మిట్‌కు హాజరైన చరణ్.. కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తన భార్య ఉసాసన ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేశారు. ఉపాసనతో పాటు తమకు పుట్టబోయే బిడ్డకు కూడా జపాన్ తో కనెక్షన్ ఉందని రామ్ చరణ్ అన్నారు. జపాన్‌లోనే ఆ మ్యాజిక్ జరిగిందని.. ప్రస్తుతం తన భార్య ఉపాసనకు ఏడో నెల అని రామ్ చరణ్ తెలిపారు.