Thalapathy Vijay : తలపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు - కారణం అదేనట!
Thalapathy Vijay : దళపతి విజయ్ కొత్త పార్టీ పేరులో స్వల్ప మార్పులు జరిగినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందింది.
Thalapathy Vijay TVK Party : కోలీవుడ్ స్టార్ హీరోల దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో సైతం విజయ్ పోటీ చేయనున్నారు. ఇలాంటి తరుణంలో దళపతి విజయ్ కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం విజయ్ కొత్త పార్టీ పేరులో కొంత మార్పులు చేయాలని నిర్ణయించినట్లు లేటెస్ట్ కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
తలపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు
దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీ పేరులో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ పార్టీ పేరులో అదనంగా 'క్' అనే అక్షరాన్ని జోడిస్తున్నారట. అందుకు కారణం, ఈ పార్టీ పేరుకు కొంత వ్యతిరేకత వస్తుండడమే అని అంటున్నారు. 'తమిళగ వెట్రి కళగం' పార్టీని ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడు కొన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోందట.
దానికి తోడు తమిళనాడులో 'తమిళగ వాల్వురిమై కట్చి' అనే పేరుతో ఓ పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దళపతి విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండడంతో తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరులో 'క్' అనే అక్షరాన్ని జోడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రకారం ఇకనుంచి తలపతి విజయ్ పార్టీని 'తమిళగ వెట్రిక్ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
వెట్రిమారన్ తో విజయ్ చివరి చిత్రం
తమిళంలో 'వడ చెన్నై', 'అసురన్', 'విడుదలై' వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రి మారన్ ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా రా అండ్ రస్టిక్ సినిమాలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ తో సినిమా చేయాలని తలపతి విజయ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు తన చివరి చిత్రాన్ని ఈ దర్శకుడితోనే చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియా ద్వారా సమాచారం అందుతోంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతోనే తన చివరి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ అవకాశాన్ని వెట్రిమారన్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయ్ 'గోట్' వచ్చేది అప్పుడే
తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్(Greatest Of All Time) సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : విక్రమ్ సినిమాకి తప్పని కష్టాలు - 'తంగలాన్' రిలీజ్ మరోసారి వాయిదా?