Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!
'బింబిసార' విడుదలై వారం రోజులు దాటింది. ఇంకా థియేటర్లలో ఉంది. తొలి వారం ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? రెండో వారం సినిమా ఎన్ని థియేటర్లలో ఉంది? వంటి విషయాల్లోకి వెళితే...
'బింబిసార' సక్సెస్ మీట్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒక మాట అన్నారు... ''సినిమా విడుదల అయిన తర్వాత ఇండస్ట్రీలో ప్రముఖులు అందరూ ఫోనులు చేసి మాట్లాడుతుంటే నాకు మళ్ళీ పుట్టినట్టు ఉంది'' అని! ఈ విజయం తనకొక పునర్జన్మ అన్నట్లు ఆయన మాట్లాడారు. నిజం చెప్పాలంటే... 'బింబిసార' విజయం టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ. ఈ సినిమా కలెక్షన్స్ చాలా మందికి ఊపిరి ఇచ్చాయి.
Bimbisara Movie Box Office Phenomena : కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూలు చేసినప్పటికీ... డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోతే వాళ్ళకు నష్టాలు తప్పవు. పదుల కోట్లు, అంత కంటే తక్కువ పెట్టి కొన్న సినిమాలు బాక్సాఫీస్ బరిలో పెట్టుబడికి రెండింతలు వసూలు చేస్తే? అద్భుతమే. అటువంటి అద్భుతమే 'బింబిసార' సినిమా చేసి చూపించింది.
'బింబిసార' సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మలేదు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట్రికల్ రైట్స్‌ను కేవలం సుమారు పదిహేను కోట్లకు విక్రయించారు. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకున్న సినిమా... తొలి వారం గడిచే సరికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు డబుల్ కలెక్ట్ చేసింది. దాంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.
Bimbisara First Week Collections In Telugu States : తొలి వారంలో 'బింబిసార' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వసూళ్లు చూస్తే... రూ. 22.30 కోట్లు ఉన్నాయి. 'లాల్ సింగ్ చడ్డా', 'మాచర్ల నియోజకవర్గం', 'కార్తికేయ 2'... ఈ వారం మూడు సినిమాలు విడుదల అయినప్పటికీ ఈ శుక్రవారం రూ. 1.13 కోట్లు వసూలు చేసింది. కొత్త సినిమాలను తట్టుకుని వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్', 'విక్రమ్', 'మేజర్' తర్వాత సర్వత్రా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బింబిసార' అని చెప్పాలి.
రెండో వారంలోనూ 350 థియేటర్లలో!
Bimbisara Second Week Theaters Count In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో 'బింబిసార' 650కు పైగా థియేటర్లలో విడుదలైంది. సాధారణంగా వారం రోజుల తర్వాత సగానికి పైగా ఎక్కువ థియేటర్ల నుంచి సినిమాను తొలగిస్తున్న రోజులు ఇవి! ఇటువంటి తరుణంలో సగానికి పైగా థియేటర్లలో 'బింబిసార' సినిమా ఉండటం గొప్ప అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో 'బింబిసార' ఎనిమిది రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే...
నైజాం : రూ. 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 3.50 కోట్లు
సీడెడ్ : రూ. 5.30 కోట్లు
నెల్లూరు : రూ. 71 లక్షలు
గుంటూరు : రూ. 1.72 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 1.25 కోట్లు
తూర్పు గోదావరి : రూ. 1.48 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 1.09 కోట్లు
'బింబిసార' తొలి వారంలో రూ. 35 కోట్ల గ్రాస్ (రూ. 22.30 కోట్ల షేర్) వసూలు చేసింది. ఎనిమిదో రోజు వసూళ్లు యాడ్ చేస్తే... రూ. 36. 85 కోట్ల గ్రాస్ (రూ. 23.45 కోట్ల షేర్) వచ్చింది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకలో ఎనిమిది రోజుల్లో రూ. 1.53 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 1.87 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 44.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. రెండో భాగంలో దేవదత్తుడి పార్ట్ ఎక్కువ ఉంటుందని టాక్. అయితే... ఆయన క్రూరుడైన మహా చక్రవర్తిగా ఆయన చూపించిన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
బింబిసారకు జోడీగా కేథరిన్ కనిపించారు. మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువే. అయితే... రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్వరలో రెండో పార్ట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ సర్‌ప్రైజ్