Mangalavaaram Movie Song : మరణం తప్పదిక ప్రతీ మంగళారం - చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం!
Ganagana Mogalira Song from Mangalavaaram Movie : 'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మంగళవారం'. ఇందులో తొలి పాటను ఈ రోజు విడుదల చేశారు.
''మరణం తప్పదిక ప్రతి మంగళారం
చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం
వేట మొదలయ్యిందిరా ఇవ్వాల్సిందే ప్రాణం
తప్పుకుని పోదామన్నా పోలెవెంతో దూరం''
- ఇదీ 'మంగళవారం' సినిమా నుంచి విడుదలైన తొలి పాట 'గణగణ మోగాలిరా...'లో ఓ చరణం. నిశితంగా గమనిస్తే... ఈ పాటలో కథ గురించి క్లుప్తంగా చెప్పేశారు. ఏ విధంగా ఉంటుందో హింట్స్ ఇచ్చేశారు. ప్రతి మంగళవారం ఓ మరణం తప్పదని, ఆ మరణం కూడా ప్రజల్లో వణుకు పుట్టించేలా ఉంటుందని, దాన్నుంచి ఎవరూ దూరంగా వెళ్లలేరని అర్థం అవుతోంది.
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు ఇతర తారాగణం. 'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు.
'మంగళవారం'లో 'గణగణ మోగాలిరా...'
జాతర నేపథ్యంలో 'గణగణ మోగాలిరా...' పాటను తెరకెక్కించారు. పాన్ ఇండియా హిట్ 'కాంతారా', తెలుగులో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్. ఆయన ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'గణగణ మోగాలిరా...' పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా... వి.ఎం. మహాలింగం ఆలపించారు.
''పచ్ఛా పచ్చని ఊరు మీద
పడినది పాడు కన్ను
ఆరని చిచ్చే పెట్టి పోతాదే!
ఆపేవాడు లేనే లేడు అంతా బూడిదే
తెల్లా తెల్లటి గోడ మీద
ఎర్రటి అక్షరాలు
వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే!
రాసేవాడు వీడో వాడో ఏమో తెలీదే''
అంటూ పాట సాగింది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న న్యూ ఏజ్ థ్రిల్లర్ చిత్రమిది. పచ్చని పల్లెపై ఎవరి కన్నో పడటంతో మంటలు మొదలయ్యాయని, ప్రజల్లో భయం పెరిగిందని భాస్కరభట్ల సాహిత్యం ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ విడుదలైన 'మంగళవారం' టీజర్ చూస్తే... కొన్ని సన్నివేశాల్లో పాయల్ ఒంటి మీద నూలుపోగు లేకుండా కనిపించారు. అదే సమయంలో ఆమె కళ్లలో ఓ ఆవేదన, ఆగ్రహం సైతం కనిపించాయి. ఇప్పుడీ పాట వింటుంటే... దర్శకుడు అజయ్ భూపతి కొత్త కథను చెప్పబోతున్నారని అర్థం అవుతోంది.
Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''కథలో కీలక సందర్భంలో 'గణగణ మోగాలిరా' పాట వస్తుంది. పాటల్లోనూ దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పారు. కంటెంట్‌తో కూడిన కమర్షియల్ ఫిల్మ్స్ తీశారాయన. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలను వెల్లడిస్తాం'' అని చెప్పారు.
Also Read : 'గుంటూరు కారం'లో మహేష్ బాబు షర్ట్ మహా కాస్ట్లీ గురూ - రేటెంతో తెలుసా?
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన బాణీ అందించారు. కొన్నేళ్ళ పాట జాతరలలో ఈ పాట వినిపిస్తుంది. మా కథను కూడా చెప్పే పాట ఇది. ఇక సినిమా విషయానికి వస్తే... గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.
'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. మంగళవారం చిత్రానికి కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, కళ : మోహన్ తాళ్లూరి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, పోరాటాలు : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైన్ & ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, నృత్యాలు : భాను, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్.