Aishwarya Rajesh: అలాగైతే నేను చేయలేను, మెంటల్ నేను - టాలీవుడ్‌పై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
Aishwarya Rajesh: తెలుగమ్మాయి అయినా కూడా తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు ఐశ్వర్య రాజేష్. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై ‘డియర్’ మూవీ తెలుగు ప్రెస్ మీట్‌లో తను స్పందించింది.
Aishwarya Rajesh About Not Acting In Telugu Movies: తెలుగమ్మాయిలకు తెలుగులో సినిమా అవకాశాలు రావు.. ఈ మాటను ఇప్పటికే చాలామంది నటీమణుల నోట విన్నారు ప్రేక్షకులు. ఇక కంటెంట్ మారుతోంది, కథలు మారుతున్నాయి. తెలుగుమ్మాయిలకు కూడా అవకాశాలు వస్తున్నాయని కొందరు చెప్పినా.. ఇప్పటికీ ఇతర భాషా పరిశ్రమల్లోనే బిజీ అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. అందులో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. తను నటించిన తమిళ చిత్రాలే తెలుగులో డబ్ అవుతున్నాయి తప్పా.. తెలుగులో తను నేరుగా సినిమాలు చేయడం లేదు. ఈ విషయంపై ఐశ్వర్య రాజేష్ స్పందించింది. ‘డియర్’ మూవీ తెలుగు ప్రెస్ మీట్‌లో తాను తెలుగు సినిమాలు చేయకపోవడంపై ఐశ్వర్య వివరణ ఇచ్చింది.
పెద్ద సినిమా చేయాలి..
‘‘తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయి. కానీ నేను తెలుగు సినిమా చేస్తే కచ్చితంగా పెద్దది, మంచిదే చేస్తాను. అలాంటి సినిమా కరెక్ట్‌గా రాలేదు, ఇంకా సెట్ అవ్వలేదు. నాకు ప్రత్యేకంగా ఇదే జోనర్‌లో చేయాలని ఏం లేదు. ఒక్కొక్కసారి చాలా కథలు వింటాం. కథ చాలా బాగున్నా కూడా ఆ పాత్రలో నన్ను నేను చూసుకోలేను. అందుకే నాకు కథ నచ్చినా కానీ నేను చేయలేను. ఇప్పుడు ‘డియర్’ సినిమాలోని దీపికా అనే క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోగలిగాను. ఒక కథకు నేను రిలేట్ కాకపోతే వెళ్లి 30, 40 రోజులు అక్కడ పనిచేయలేను. నన్ను నేను దీపికాగా చూసుకోలేకపోతే నేను పర్ఫార్మ్ చేయలేను. నాకు నచ్చాలి, మనసుకు నచ్చాలి, మైండ్‌కు నచ్చాలి. అలా చాలా ఉన్నాయి. మెంటల్ నేను’’ అని చెప్తూ నవ్వింది ఐశ్వర్య రాజేష్.
యాక్టర్స్ అంటే అంతే..
జీవీ ప్రకాశ్‌తో జోడీకడుతూ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ‘డియర్’లో తను గురక పెట్టే పెళ్లాం పాత్రలో కనిపించింది. అయితే ఈ పాత్రకు రిలేట్ అవ్వడానికి కారణం ఏంటని, తాను కూడా గురక పెడతారా అని ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నేను గురక పెట్టను. అది వేరు కదా. క్యారెక్టర్‌కు రిలేట్ అయ్యానని నేను గురక పెడతానని కాదు. గతేడాది ఫర్హానా అనే ఒక సినిమా చేశాను. అలా అని నేను ఫర్హానాలాగా అయ్యిండాలని కాదు కదా. ఆ పాత్ర మనకు నచ్చి చేయాలనిపించాలి. అదే మా పని. యాక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ నచ్చవు. కొన్ని నచ్చుతాయి. అలాంటి క్యారెక్టర్లలో నాకు నచ్చి చేసిన క్యారెక్టరే దీపికా. రియల్ లైఫ్‌లో మీరు అదేనా అంటే ఏం చేప్తాం’’ అంటూ సమాధానమిచ్చింది ఐశ్వర్య రాజేష్.
తమిళంతో పాటు తెలుగులో..
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ‘డియర్’లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్‌కు గురక సమస్య ఉంటుంది. అదే సమయంలో జీవీ ప్రకాశ్‌తో పెళ్లి అవుతుంది. ఇక తనకు ఉన్న గురక అలవాటు వల్ల వారి రిలేషన్‌షిప్‌లో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేదే సినిమా. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ఏప్రిల్ 11న ‘డియర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జీవీ ప్రకాశ్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా సంగీతాన్ని కూడా తానే అందించాడు. ‘డియర్’ ట్రైలర్‌తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది మూవీ టీమ్.
Also Read: సినిమా మధ్య నుండే వచ్చేశాను, అది మంచి సినిమా అని అసత్యం చెప్పలేను - కిరణ్ అబ్బవరం