(Source: ECI/ABP News/ABP Majha)
సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదలైన 'రామన్న యూత్' ట్రైలర్!
'పెళ్లిచూపులు' మూవీ ఫేమ్ అభయ్ నవీన్ డైరెక్టర్ గా మారుతూ తెరకెక్కించిన తాజా చిత్రం 'రామన్న యూత్'. ఈ చిత్ర ట్రైలర్ను తాజాగా హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్లిచూపులు' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభయ్ నవీన్, ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ పెళ్లిచూపులు మూవీ తర్వాత అతనికి పెద్దగా బ్రేక్ రాలేదు. అయినా కూడా ఓవైపు సినిమాలో నటిస్తూనే తాజాగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. 'రామన్న యూత్' అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో వెండితెరకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు అభయ్ నవీన్. తను చూసినా, తెలుసుకున్న అంశాలతో విలేజ్ పాలిటిక్స్ అంశాలను మేళవించి ఓ కథను రాసుకున్నాడు. ఆ కథను స్వయంగా తనే డైరెక్ట్ చేశాడు. చాలా రోజులకి క్రితమే ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది.
కానీ సినిమాలో నటించిన వాళ్లంతా కొత్త వాళ్లు కావడం, ఇండస్ట్రీలో పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఫైనల్ గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సిద్ధార్థ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ను చూసిన అనంతరం తనకు బాగా నచ్చిందని, సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఈ సందర్భంగా మూవీ టీం కి తన బెస్ట్ విషెస్ ను తెలిపారు సిద్ధార్థ్.
ఇక 'రామన్న యూత్' ట్రైలర్ విషయానికొస్తే.. పల్లెటూర్లలో యువత రాజకీయ నాయకుల కోసం తమ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? ఆ నాయకుల కోసం ఊరిలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? రాజకీయ నాయకులు, స్వార్థపరుల వల్ల గ్రామీణ రాజకీయాలు యువత ఎలా చెడిపోతున్నారు? అనే అంశాలను ఎంటర్టైనింగ్ వే లో చెప్పే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని వాడకుండా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలను చాలా హానెస్ట్ గా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అభయ్ నవీన్ ఓవైపు దర్శకత్వం చేస్తూనే సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. అతనితోపాటు అమూల్య రెడ్డి ఫిమేల్ లీడ్ లో కనిపించింది. శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అనిల్ గీల తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు.
నిజానికి ఈ మూవీకి సంబంధించి కొద్ది నెలల క్రితమే చాలామందికి ప్రివ్యూస్ కూడా వేశారు. ఆ ప్రివ్యూస్ చూసిన వాళ్లంతా సినిమా బాగుందని, చాలా మంచి కంటెంట్ ఎంచుకున్నారని, విలేజ్ బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ని చాలా బాగా తీశారని టీమ్ మొత్తాన్ని అప్రిషియేట్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమాని కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి 'హృదయ కాలేయం' ఫేమ్ కామ్రాన్ సంగీతం అందిస్తున్నారు. రూపక్ రోనాల్డ్ సన్, నవీన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read : 'సలార్' హిట్ అవ్వాలని గుడిలో పూజ చేయించిన ప్రశాంత్ నీల్ - వీడియో వైరల్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial