Balakrishna: రెండు సార్లు యాక్సిడెంట్ - ఆ రోజు బాలకృష్ణ ఎంతో కేర్ తీసుకున్నారు: అనితా చౌదరి
అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అనిత చౌదరి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన జీవితంలో జరిగిన యాక్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి అనిత చౌదరి. ఒక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. అప్పట్లో ఉదయభాను, సుమ, ఝాన్సీ, శిల్పా లాంటి వాళ్లు యాంకర్స్ గా బుల్లితెరను ఏలుతున్న సమయంలోనే అనిత చౌదరి కూడా యాంకర్ గా రాణించారు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కస్తూరి, ఋతురాగాలు వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 'రాజా', 'మురారి', 'నువ్వే నువ్వే', 'ఉయ్యాల జంపాల', 'గురు', 'నిర్మలా కాన్వెంట్', 'మెంటల్ మదిలో', 'చత్రపతి', 'మన్మధుడు' వంటి సినిమాలతో నటిగా ఆకట్టుకున్నారు.
అలాంటి అనిత చౌదరి తన నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు అనిత చౌదరి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా జీవితంలో రెండు మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో మొదటిసారి అమెరికా వెళుతున్న సమయంలో ఆక్సిడెంట్ జరిగింది. అప్పుడు కస్తూరి సీరియల్ లో నా నటన మెచ్చుకొని సన్మానం చేసేందుకు ఆహ్వానించారు. ఆ టైంలో హోటల్ కి కార్ లో వస్తుండగా డ్రైవర్ ఫోన్ పడిపోయిందని కిందికి వంగడంతో ఎదురుగా ట్రక్ వచ్చి గుద్దింది. నేను బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను. అలా డ్రైవర్ పొరపాటు వల్ల నా కాలర్ బోన్ విరిగిపోయి కుట్లు కూడా పడ్డాయి" అని తెలిపారు
"ఆ తర్వాత ‘కేరింత’ మూవీ టైంలో మరో ఆక్సిడెంట్ అయింది. ఆ ఆక్సిడెంట్ లో నా డిస్క్ విరిగింది. ఆ టైంలో నేను ఇక్కడ ఉండను. అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామని అనుకున్నా. కానీ నాకు ఒక అభిమాని ఉంది. తను బాలకృష్ణకు చాలా క్లోజ్. ఫ్యామిలీ ఫ్రెండ్. దాంతో తను నా గురించి ఆలోచించి బాలకృష్ణ గారికి నా ఆక్సిడెంట్ గురించి చెప్పింది. అప్పుడు బాలకృష్ణ వెంటనే స్పందించారు. స్వయంగా హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ తీసుకొచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నాకు ట్రీట్మెంట్ చేయించారు. నిజంగా సాయం చేయాలంటే అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు" అని అన్నారు.
"నాకు యాక్సిడెంట్ అయి నా లైఫ్ పోయిందని చాలామంది నా మీద జోక్స్ వేసేవారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ నా పక్కన ఉన్నారు. అప్పుడు నాకు కృష్ణవంశీ గారు చెప్పిన మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించాయి" అంటూ చెప్పుకొచ్చారు అనిత చౌదరి. అలాగే కొన్ని అనుకోరి కారణాలవల్ల చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ మిస్ చేసుకున్నానని ఈ సందర్భంగా చెప్పారు. 'బొమ్మరిల్లు' సినిమాలో శ్రీవాణి క్యారెక్టర్ ముందు తాను చేయాల్సిందని, అలాగే రీసెంట్ గా వచ్చిన 'కార్తికేయ 2' లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల అవి చేయలేకపోయానని అన్నారు.
Also Read : ఫాంటసీ జానర్‌లో చిరంజీవి సినిమా - మెగా అప్డేట్ వచ్చేసిందోచ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial