Rangamarthanda : మెగాభిమానులకు కృష్ణవంశీ మరో కానుక - ఈసారి హీరోతో ఎడిటింగ్ చేయించి మరీ
Krishna Vamsi gift to mega fans : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా సినిమా 'రంగమార్తాండ'లో ఓ షాయరీకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన విజువల్స్ వేసి విడుదల చేశారు. ఇప్పుడు మరో కానుక రెడీ చేశారు.
మెగా అభిమానులకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరో కానుక రెడీ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). ఇందులో ఓ షాయరీకి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గళం అందించిన సంగతి తెలిసిందే. ఇటీవల దానిని విడుదల చేశారు.
షాయరీ చూసి చిరు కంటతడి...
'రంగమార్తాండ' చిత్రంలో రంగస్థల కళాకారుల గురించి వివరించే సన్నివేశంలో వచ్చే షాయరీ అది. లక్ష్మీ భూపాల రాశారు. దానికి గళం అందించే సమయంలో, షాయరీకి తన విజువల్స్, ఫోటోలు వచ్చేలా ప్లే చేసిన వీడియో చూసి చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు. అందువల్ల, అందులో ఏముంది? అని ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. షాయరీ చూశాక హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఇప్పుడు హీరోతో ఎడిట్ చేయించి మరీ...
షాయరీకి లభిస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృష్ణవంశీ తెలిపారు. ప్రేక్షకులు పంపిస్తున్న సందేశాలు తన హృదయాన్ని టచ్ చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఎనర్జీతో అదే షాయరీ మీద మరో ఎడిట్ చేయించారు. మళ్ళీ చిరంజీవి విజువల్స్ వేసి! ఆ వీడియోకి విజయ నిర్మల మనవడు, నటుడు సీనియర్ నరేష్ కుమారుడు, హీరో అయిన నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్ చేశారని కృష్ణవంశీ చెప్పారు. ఆ వీడియో గురువారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిరంజీవికి చూపించి మరీ ఆ వీడియో అనుమతి తీసుకున్నామన్నారు.
Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
Hi friends... THQ for d MEGA appreciation... So happy ... Here one more good news to all MEGA fans ...
— Krishna Vamsi (@director_kv) December 28, 2022
Thank You ♥️🙏#NenokaNatudni @KChiruTweets #Rangamarthanda @PRAKASHRAAJ @MERAMYAKRISHNAN #BRAHMANANDAM @ilaiyaraaja @LakshmiBhupal @RajaShyamalaEnt @SillyMonksMusic pic.twitter.com/rIUsftkjeR
షాయరీలో ఏముంది? అనేది చూస్తే...
''నేనొక నటుడ్ని
చమ్కీల బట్టలేసుకుని
అట్ట కిరీటం పెట్టుకుని
చెక్క కత్తి పట్టుకుని
కాగితపు పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే
చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతను నేను
నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్ని
నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులేసి నవరసాలూ మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకు మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను
నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారథి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరం నరం నాట్యమాడే నటరాజు రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండుడ్ని నేను
నేనొక నటుడ్ని
అసలు మొహం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ 9 తలలు ఉన్న నటరావణుడ్ని
నింగి, నేల రెండు అడుగులైతే
మూడో పాదం మీ మనసుల మీద మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను
మహా అదృష్టవంతుడ్ని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకూ నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు''
'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మికా రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు - టాప్‌లో బాలకృష్ణ, నెక్స్ట్ ఎవరంటే?