Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎప్పుడూ కూల్‌గా ఉంటూ.. కంటెస్టెంట్స్ చేసే తప్పులు ఏంటో తమకు తెలియజేసే నాగార్జున.. మొదటిసారి సీరియస్ అయ్యారు.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో గత అయిదు సీజన్స్ నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఈ అయిదు సీజన్స్‌లో ఎంతోమంది కంటెస్టెంట్స్‌ను చూసుంటారు. కానీ ఈ సీజన్‌లో శివాజీ మీద సీరియస్ అయినట్టుగా ఇంకా ఏ సీజన్‌లో, ఏ కంటెస్టెంట్ మీద సీరియస్ అవ్వలేదు నాగ్. అలా అవ్వడానికి శివాజీ అన్న మాటలే కారణం. అమర్‌దీప్, శోభా, ప్రియాంకలపై శివాజీకి ముందు నుంచే మంచి అభిప్రాయం లేదు. దాని వల్ల ఎన్నోసార్లు వారి వెనుక వారి గురించి, వారి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడారు కూడా. కానీ ఈసారి శివాజీ మాటలు కాస్త శృతిమించాయి. శోభా, ప్రియాంకల ప్రవర్తనను ఉద్దేశించి ‘‘మా ఇంట్లో ఆడవాళ్లైతే పీక మీద కాలేసి తొక్కుతా’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఆ విషయంపై అసలు ఏంటి ఆ మాట అని నాగార్జున ప్రశ్నించారు. దీంతో ఇద్దరికీ కాసేపు వితండవాదం జరిగింది. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ నాగార్జునతో ఇలా వాదనకు దిగలేదు. ఎదురు చెప్పలేదు. అయితే శివాజీ అలా చేయడం ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తున్నారు..
ముందుగా శివాజీని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన నాగార్జున.. శోభా, ప్రియాంకల గురించి తను మాట్లాడిన వీడియోను చూపించారు. ‘‘మా ఇంట్లో ఆడవాళ్లైతే పీకుతా’’ అని ఆ వీడియోలో ప్రశాంత్‌తో అన్నాడు శివాజీ. నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్లు అయితే ఇలాగే చేస్తావా అని నాగార్జున క్లియర్‌గా అడిగారు. అవును కొడతాను అన్నాడు. ఆ మాటకు నాగార్జునకు కోపం రావడం మొదలయ్యింది. ఆ తర్వాత పీక మీద కాలేసి తొక్కుతా అంటూ శివాజీ అన్న మరో మాటకు సంబంధించిన వీడియోను కూడా తనకు చూపించారు. అయితే అమర్‌దీప్, ప్రియాంక, శోభా.. ముగ్గురు కలిసి కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రశాంత్ అనే కామన్ మ్యాన్‌ను ముందు నుంచి టార్చర్ చేస్తూనే ఉన్నారని, ప్రశాంత్ ఏది మాట్లాడినా.. ముగ్గురూ అరుస్తారని, రా అంటారని చెప్పుకొచ్చాడు శివాజీ. దాని వల్లే వారిపై తనకు కోపం వచ్చి అలా అన్నానని చెప్పాడు.
ఆడియన్స్‌పై కూడా శివాజీ ఆగ్రహం..
నాగార్జున ఎన్నిసార్లు అడిగినా కూడా తాను అన్న మాటలు ఫ్లోలో అన్నానని, అదంతా పొరపాటు అని కొట్టిపారేశాడు శివాజీ. అది పొరపాటు కాదు తప్పు అని నాగార్జున చెప్తున్నా కూడా శివాజీ ఒప్పుకోలేదు. అది కరెక్ట్ కాదని నాగ్ గట్టిగా చెప్తుంటే.. అది తప్పు కూడా కాదని శివాజీ అంతకంటే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా అంతే కాకుండా ఫ్లోలో అంటాం కానీ చేసేస్తామా అని రివర్స్ అయ్యాడు శివాజీ. తనకు మాత్రమే కాదు.. ఆడియన్స్‌కు కూడా శివాజీ మాటలు తప్పుగానే అనిపించాయని ఆడియన్స్‌లో ఉన్న ఒక అమ్మాయిని ప్రశ్నించారు. అమ్మాయిలను అలా అనడం కరెక్ట్ కాదేమో అని ఆ అమ్మాయి చెప్తుండగానే.. ‘‘అంటే మగపిల్లలను అంటే ఓకేనా?’’ అని శివాజీ రివర్స్ అయ్యాడు. దీంతో నాగార్జున జోక్యం చేసుకొని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావని, మగపిల్లలను అంటే ఓకేనా అని అడగడం ఏంటి అని సీరియస్ అయ్యారు. ‘‘మీరు చెప్తుంది అలాగే ఉంది. ఆడపిల్లలను అన్నానని తప్పుగా చూపిస్తున్నారు. అంటే మగపిల్లలను అంటే ఓకేనా?’’ అని మళ్లీ మళ్లీ తను మాట్లాడేదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడాడు శివాజీ.
వాళ్లకెందుకు సారీ చెప్పాలి..
చాలాసేపు వితండవాదం తర్వాత తను చేసింది తప్పు అయితే నాగార్జునకు సారీ చెప్తానని శివాజీ అన్నాడు. సారీ తనకు కాదని.. ఆడియన్స్‌లోని ఆడపిల్లలకు చెప్పాలని నాగ్ అన్నారు. అయితే ‘‘వాళ్లకి నేనెందుకు సారీ చెప్తాను’’ అంటూ శివాజీ రివర్స్ అయ్యాడు. ‘‘నేను అసలు ఆడపిల్లలను అనలేదు. మా ఇంట్లో ఆడపిల్లలైతే అని అన్నాను. దానికి ఎందుకు సారీ చెప్పాలి’’ అన్నట్టుగా మాట్లాడాడు. శివాజీ ప్రవర్తనతో నాగార్జునకు మరింత కోపం వచ్చింది. మీ ఇంట్లో ఆడపిల్లలు అనే పదం ఆడపిల్లలు ఎవరు నీ ఇంట్లో ఉన్నా కూడా ఈ మాట వర్తిస్తుంది కదా అని నాగ్ అన్నారు. దీంతో చేసేది ఏం లేక సారీ చెప్పాడు శివాజీ. అప్పటికీ తనది ఏం తప్పు లేదని, తప్పుగా మాట్లాడలేదనే భావనలోనే ఉన్నాడు. శోభా, ప్రియాంకలకు కూడా సారీ చెప్పమని, ఒకవేళ శివాజీ స్థానంలో తాను ఉంటే చెప్పేవాడిని అని నాగ్ తెలిపారు. దీంతో బయటికి వచ్చిన తర్వాత పీకుతా అనే పదం ఉపయోగించానని, అది కరెక్ట్ కాదని నాగార్జున అన్నారని ప్రియాంక, శోభాలకు చెప్తూ మాటవరుసకు సారీ అడిగాడు శివాజీ.
Also Read: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు