Tollywood : అక్టోబర్ 13.. అందరికీ కావాలి!
అక్టోబర్ 13 నాడు ఏ సినిమా అయితే వస్తుందో అది బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు హాట్ ఫేవరేట్ గా మారింది అక్టోబర్ 13. ఈ డేట్ ని సొంతం చేసుకోవాలని చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తను తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అక్టోబర్ 13ను రిజర్వ్ చేసుకున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభించారు. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తయిపోతే సినిమా అక్టోబర్ 13న రావడం ఖాయం. ఆలస్యమైతే మాత్రం చెప్పలేని పరిస్థితి.
ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' గనుక చెప్పిన టైమ్ కి రాకపోతే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాను ఆ రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం ఒకేరోజు వచ్చే అవకాశాలు లేవు. రాజమౌళి సినిమాకి పోటీగా ఎవరూ తమ సినిమాలను రిలీజ్ చేసే ధైర్యం చేయరనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు గనుక రాకపోతే బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప'ను విడుదల చేయాలని నిర్మాతలకు ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి కావాల్సిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. ఒక్కసారి ఆ డేట్ ఫ్రీ అయితే 'పుష్ప'ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు.
అల్లు అర్జున్ కూడా తన సినిమా వీలైనంత త్వరగా థియేటర్ లోకి వస్తే బాగుంటుందని చూస్తున్నారు. తొలిసారి అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక అదే రోజుకి వస్తే బాగుంటుందనేది 'రాధేశ్యామ్' టీమ్ ఆలోచన. కానీ ఆ సమయానికి అన్ని పనులు పూర్తవుతాయా అనేది సందేహం.
సినీ జనాలంతా ఇంతగా ఈ డేట్ పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే.. అది దసరా సీజన్ కావడం.. అలాంటి సీజన్ ఇంకొకటి కావాలంటే మరో మూడు నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. పెద్ద సినిమాలు ఈ దసరా సీజన్ మిస్ చేసుకుంటే మళ్లీ సంక్రాంతి వరకు రాలేవు. పోనీ అప్పుడేమైనా పోటీ తక్కువ ఉంటుందా అంటే అదీ కాదు. 'సర్కారు వారి పాట', 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ వంటి సినిమాలతో పాటు 'ఎఫ్ 3' సినిమా కూడా సంక్రాంతికే రావాలని నిర్ణయించుకుంది.
మొత్తానికి అక్టోబర్ 13 నాడు ఏ సినిమా అయితే వస్తుందో అది బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ సీజన్ ను ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలి!