Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం, నటి హేమకు షాకిచ్చిన పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీ తిప్పలు నటి హేమకు ఇప్పట్లో తప్పేలా లేవు. తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించారు.
Bengaluru Rave Party case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పార్టీతో తనకు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని నటి హేమ ఇప్పటి వరకు చెప్తూ వస్తుండగా పోలీసులు మాత్రం ఆమె డ్రగ్స్ తీసుకున్నారని తేల్చేశారు. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఆమె ఎండీఎంఏ డ్రగ్ ను తీసుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టుకు అందించారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు. హేమతో పాటు రేవ్ పార్టీకి హాజరైన మరో నటుడికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 88 మంది నిందతులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. రేవ్ పార్టీ నిర్వహించిన 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 1,086 పేజీల ఛార్జ్ షీట్ ను న్యాయస్థానానికి అందజేశారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీ చిక్కులు హేమకు ఇప్పట్లో తప్పవనే టాక్ వినిపిస్తోంది.
డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ- హేమ
అటు బెంగళూరు రేవ్ పార్టీ వ్యహరానికి సంబంధించిన కేసు ఛార్జ్ షీట్ లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి మాదకద్రవ్యాలను తీసుకోలేదని వెల్లడించారు. తన నుంచి బెంగళూరు పోలీసులు కనీసం రక్త నమూనాలు కూడా తీసుకోలేదని వెల్లడించారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని ఛాంలెంజ్ విసిరారు. తన పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నట్లు తెలిసిందని, తన అడ్వకేట్స్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు.
Also Read : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా? పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే
బెయిల్ మీద బయట ఉన్న హేమ
రేవ్ పార్టీ కేసులో ప్రస్తుతం హేమ బెయిల్ మీద బయట ఉన్నారు. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందంటూ బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు అడ్వకేట్స్ వాదించారు. హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలను చూపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
హేమ విషయంలో ‘మా’ నిర్ణయం ఏంటి?
డ్రగ్స్ కేసులో హేమకు బెయిల్ రావడంతో హేమపై విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్లు ‘మా’ ప్రకటించింది. తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ మెడికల్ రిపోర్టులను కూడా చూపించింది. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్పింది. ఈ నేపథ్యంలో ‘మా’ ఆమెపై విధించిన బ్యాన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు ఆమె పేరు ఛార్జ్ షీట్ లో ఉండటంతో ‘మా’ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.