Telugu Film Chamber Of Commerce: తెలుగు ఫిలిం చాంబర్ సంచలన నిర్ణయం - షూటింగ్స్‌పై ప్రొడ్యూసర్స్‌కు కీలక ఆదేశాలు
TFCC: సినీ కార్మికుల బంద్ కొనసాగుతోన్న వేళ టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఫిలిం చాంబర్ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి షూటింగ్స్ చెయ్యొద్దని స్పష్టం చేసింది.

TFCC Direct Guidelines To Producers: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఫెడరేషన్, ఫిలిం చాంబర్ మధ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని ఫెడరేషన్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా... ఫిలిం చాంబర్ అందుకు సుముఖంగా లేదు. కొందరు నిర్మాతలు ఇతర చోట్ల నుంచి కార్మికులను తెచ్చి షూటింగ్స్ నిర్వహించేందుకు యత్నిస్తుండగా వివాదం నెలకొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ చెయ్యొద్దని ప్రొడ్యూసర్స్‌కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. 'స్టూడియోస్, ఔట్ డోర్ యూనిట్స్ పర్మిషన్ లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఈ డెసిషన్ తీసుకున్నాం. మీటింగ్స్, సమావేశాలకు ఫిలిం చాంబర్ సభ్యులు దూరంగా ఉండాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.' అంటూ టీఎఫ్‌సీసీ ఆదేశాలిచ్చింది.
ఫిలిం చాంబర్ వర్సెస్ ఫెడరేషన్
గత కొంతకాలంగా ఫిలిం చాంబర్ వర్సెస్ ఫెడరేషన్ అన్నట్లుగా వివాదం సాగుతోంది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. అలాగే, ఏ రోజు వేతనం ఆ రోజే ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. దీనిపై నిర్మాతలపై మండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని... ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఫెడరేషన్ అంతరాయాలతో నిర్మాణంలో ఉన్న మూవీస్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పింది.
వివాదాల నేపథ్యంలో నిర్మాతలు ఇవ్వగలిగే వేతనాలకు పని చేసే వారిని తీసుకోవాలని నిర్ణయిస్తూ అంతకు ముందు ఓ ప్రకటన జారీ చేసింది. ఎంతో మంది ఔత్సాహికులు పని చేసేందుకు రెడీగా ఉన్నా... యూనియన్లలో చేర్చుకునేందుకు రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని కొత్తగా వచ్చే వారికి అడ్డు తగులుతున్నారని పేర్కొంది. టాలెంట్ ఉన్న వారికి పని కల్పిస్తామని తాము ఇవ్వగలిగే వేతనానికి పని చేసే వారినే తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. గురువారం కో ఆర్డీనేషన్ కమిటీ... ఫిలిం చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు, ఫిలి ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరపగా ఏమీ తేలలేదు.
మెగాస్టార్, బాలకృష్ణలతో నిర్మాతల భేటీ
ఇక ఇదే అంశంపై అటు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో భేటీ అయ్యారు. ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని చిరంజీవి తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే తాను ఇన్వాల్వ్ అవుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే, మరో 4 రోజుల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని కో ఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్ తెలిపారు.






















