Archana Gautam: కాంగ్రెస్ ఆఫీస్ ముందు దాడి, నడి రోడ్డుపై అత్యాచారం అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర నటి అర్చనా గౌతమ్ మీద రీసెంట్ గా దాడి జరిగింది. ఆమె తండ్రి, డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై ఆమె స్పందించింది.
నటి, కాంగ్రెస్ నాయకురాలు అర్చన గౌతమ్ పై తాజాగా న్యూఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం బయట దాడి జరిగింది. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెపై అటాక్ చేశారు. ఈ ఘటనలో ఆమె తండ్రితో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై అర్చన స్పందించింది.
దాడి ఘటనపై అర్చన ఏం చెప్పిందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసేందుకు తండ్రితో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది అర్చన. కానీ, అక్కడ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ఆఫీస్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఓ ఛానెల్ తో మాట్లాడిన ఆమె, ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించింది. “కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న మమ్మల్ని కొంతమంది అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వలేదు. గేటు క్లోజ్ చేశారు. మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదనే ఆదేశాలు ఉన్నాయన్నారు. నేను కేవలం ఖర్గే గారిని, ప్రియాంక గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను అని చెప్పినా వినలేదు. అక్కడ ఉన్న మగవారితో పాటు ఆడవాళ్లు కూడా నాపై దాడి చేశారు. 'బిగ్ బాస్' షో అయ్యాక వెళ్తున్న తనకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర మంచి స్వాగతం లభిస్తుంది అనుకున్నాను. కానీ, నా పట్ల వ్యవహరించిన తీరుకు ఆశ్చర్యపోతున్నాను” అని తెలిపింది.
అర్చన తండ్రి, డ్రైవర్ కు గాయాలు
ఈ ఘటనలో తన తండ్రితో పాటు డ్రైవర్ గాయపడ్డారని అర్చన వెల్లడించింది. “ఈ దాడి సమయంలో కొంత మంది నా జుట్టును పట్టుకుని లాగారు. ఇది రోడ్డుపై అత్యాచారానికి తక్కువేమీ కాదు. మా నాన్నతో పాటు డ్రైవర్ పైనా దాడి చేశారు. వారికి గాయాలు అయ్యాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజానిజాలు వెల్లడిస్తా” అని అర్చన తెలిపింది.
అర్చనపై దాడికి కారణం ఏంటంటే?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్ పై అర్చన మార్చిలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన తనను చంపుతానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై మీరట్ పోలీసులు కేసుల నమోదు చేశారు. తన కూతురును కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతానని బెదిరించినట్లు అర్చన గౌతమ్ తండ్రి గౌతమ్ బుద్ధ్ ఆరోపించారు. అర్చనా తండ్రి ఫిర్యాదుతో మీరట్ పోలీసులు సందీప్ సింగ్‌పై పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 504, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో తాజాగా అర్చనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Read Also: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial