Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా రీ రిలీజ్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలై సత్తా చాటగా, తాజాగా మరో మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను కథాంశంగా తీసుకొని రూపొందించిన ఈ మూవీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లు షేర్ వసూళు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఏడాది విడుదలైన చిత్రల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు సాధించింది. విక్రమ్ కెరీర్ కు ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది. అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న ఆయనకు ఈ సినిమా స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది.
మే 17న తెలుగు, తమిళంలో భారీగా రీ రిలీజ్
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ల హవా కొనసాగుతున్ననేపథ్యంలో ‘అపరిచితుడు’ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఏకంగా 700 థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పెద్ద మొత్తంలో టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమా ఓ రేంజిలో వసూళ్లు సాధించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. సినిమా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తాయంటున్నారు. సుమారు 20 ఏండ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన ఈ సినిమా, మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అంటున్నారు.
విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సీన్లు సినిమాకే హైలెట్
ఇక ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. విక్రమ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అపరిచితుడిగా, రాముగా తన హావభావాలను అద్భుతంగా చూపించి అలరించారు. ఈ సినిమాలో ఆయన నటనను ఎప్పటికీ మరచిపోలేరని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘అపరిచితుడు’లో ఆయన చేసిన యాక్టింగ్ స్థాయిలో మరే సినిమాలో కనిపించలేదంటారు సినీ విమర్శకులు. రాము, రెమో, అపరిచితుడిగా ఆయన నటన అద్భుతం అంటున్నారు. ‘అపరిచితుడు’ సినిమాకు హ్యారీష్ జైరాజ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఆయన రూపొందించిన పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఆ సినిమా మళ్లీ విడుదల కాబోతుండటంతో సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామని అని ఉవ్విళ్లూరుతున్నారు.
Read Also: ఈ 'రంగమ్మత్త' రూటే సపరేట్ - విమర్శలకు, వివాదాలకు తగ్గని హట్ యాంకర్, సోషల్ మీడియా సెన్సేషన్..