RRR Team reached Hyderabad: ఆస్కార్‌తో హైదరాబాద్ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు
ఆస్కార్ అవార్డుతో సగర్వంగా హైదరాబాద్ లో అడుగు పెట్టింది ‘RRR’ బృందం. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజమౌళి, కీరవాణి సహా సినిమా యూనిట్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జయహో నినాదాలతో హోరెత్తించారు.
ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న ‘RRR’ మూవీ, ఆస్కార్ అవార్డును గెలుచుకుని సత్తా చాటింది. తెలుగు సినిమా గొప్పదనాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాటించింది. మార్చి 12న అమెరికాలో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బంగారు ఆస్కార్ అందుకుని అదుర్స్ అనిపించింది.
‘RRR’ టీమ్ కు ఘన స్వాగతం
ఆస్కార్ పురస్కారం అందుకున్న తర్వాత ‘RRR’ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ సహా మొత్తం 14 మంది చిత్ర బృందానికి సినీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో చేరుకున్న ఫ్యాన్స్ తో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం జనసందోహంగా మారింది. భారీ సెక్యూరిటీ నడుమ రాజమౌళి, కీరవాణి సహా చిత్ర బృందాన్ని అధికారులు బయటకు తీసుకొచ్చారు. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని కీరవాణి తెలిపారు. రాజమౌళితో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించగా, ‘జైహింద్’ అంటూ వెళ్లిపోయారు.
#WATCH | Telangana: RRR Director SS Rajamouli and Music composer MM Keeravani reach Rajiv Gandhi International Airport in Hyderabad.
— ANI (@ANI) March 16, 2023
'Naatu Naatu' song from RRR won the #Oscar for the Best Original Song pic.twitter.com/ismDbDAQ3t
‘RRR’ టీమ్ కు రాజమౌళి పార్టీ
95వ ఆస్కార్ వేడుకలో ‘RRR’ సినిమాకు ఆస్కార్ రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీని, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందంపై అభినందనలు కురిపించారు. సినీ దిగ్గజాల నడుమ ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. ఇటీమలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు రాగా, తాజాగా ‘RRR’ టీమ్ హైదరాబాద్ కు వచ్చింది.
నేడు రామ్ చరణ్ రాక, ఢిల్లీ టు హైదరబాద్
అటు రామ్ చరణ్ సైతం ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడ ఓ ఛానెల్ నిర్వహించే చర్చలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోడీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ మీటింగ్ తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటారు. మరోవైపు చెర్రీకి ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు
మరోవైపు ‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు తమను మరింత ఉత్తేజంగా పని చేసేందుకు సహకరిస్తుందని చెప్పారు. ‘RRR’ మూవీ సీక్వెల్ ను మరింత వేగంగా ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Read Also: ఫహాద్, నజ్రియా క్యూట్ లవ్ స్టోరీ - ప్రేమ ఒకే, పెళ్లిపై ఊహించని విమర్శలు, అసలు ఏమైంది?