వెబ్ సీరిస్‌ల్లో అశ్లీల సీన్లు - విజయ్ శాంతి ఆగ్రహం ‘రానా నాయుడు’ పైనేనా?
నటి విజయ శాంతి ఈ ఓటీటీ వెబ్ సిరీస్ లపై మండి పడ్డారు. ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పని సరి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
కరోనా తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని పొందే మాధ్యమాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఓటీటీలు. ఒకప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే అందరూ థియేటర్లకు వెళ్లే చూసేవారు. తర్వాత కొంత కాలానికి అవి టీవీల్లో వచ్చేవి. అయితే ఇప్పుడు ఓటీటీలు వినియోగం పెరిగిపోవడంతో వెబ్ సిరీస్ లతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా ఇందులో నేరుగా విడుదల అవుతున్నాయి. సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ ఓటీటీలకు అలా కాదు. తీసింది తీసినట్టు నేరుగా ఓటీటీల్లోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ మధ్య వస్తోన్న చాలా వెబ్ సిరీస్ లపై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దానికి కారణం అందులో ఉండే కంటెంట్. తాజాగా నటి, బీజేపీ లీడర్ విజయ శాంతి ఈ ఓటీటీ వెబ్ సిరీస్ లపై మండి పడ్డారు. ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఓటీటీలలో అసభ్యకర భాష, అలాగే కొన్ని ఇబ్బందికర సన్నివేశాలపై కొంత మంది సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా దీనిపై నటి విజయశాంతి స్పందించడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె ‘రానా నాయుడు’ వెబ్ సీరిస్ పేరు చెప్పకుండా పరోక్షంగా దాని గురించి ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఓ వెబ్ సిరీస్ పై సెన్సార్ అవసరం తప్పనిసరి అని పేర్కొన్నారు. అనేక మంది ప్రజలు ఈ సమస్యను ముందుకు తెస్తున్నారన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వెబ్ సిరీస్ లో వచ్చే అసభ్యకరమైన దృశ్యాలను తొలగించాలని అన్నారు. దీనిపై ప్రజావ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటీనటులు, నిర్మాతలను కోరుతున్నానని పేర్కొన్నారు. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నానని సున్నితంగా హెచ్చరించారు. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాని రాసుకొచ్చారు విజయశాంతి.
విజయ శాంతి చేసిన పోస్ట్ లో ఆ వెబ్ సిరీస్ వివరాలు గానీ, నటీనటులు వివరాలు గానీ ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ విజయశాంతికు సపోర్ట్ చేస్తున్నారు. ఓటీటీలకు కూడా కచ్చితంగా సెన్సార్ ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వెబ్ సిరీస్ లు చాలానే విడుదల అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఇతర భాషల నుంచి తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అవి కాకుండా నేరుగా తెలుగులో వస్తోన్న ‘రానా నాయుడు’ లాంటి వెబ్ సిరీస్ లపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ డైలాగ్ లు, అడల్ట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విమర్శలు పెరిగాయి. ఇలాంటి వెబ్ సిరీస్ లు ఓ వైపు విమర్శలు ఎదుర్కొంటున్నా మరో వైపు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం గమనార్హం.
Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు