Varalaxmi's Sabari : 'శబరి' డబ్బింగ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్
Varalaxmi Sarathkumar's Sabari Movie Update : వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'శబరి'. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డబ్బింగ్ స్టార్ట్ చేశారు.
'క్రాక్'లో జయమ్మగా... 'నాంది'లో న్యాయవాదిగా... తమిళ మూవీ విజయ్ 'సర్కార్'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఓ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కుమార్తెగా... 'యశోద'లో సరోగసీ ఫెసిలిటీ సెంటర్ నిర్వాహకురాలిగా నెగిటివ్ షేడ్స్ రోల్‌లో... విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'శబరి' (Sabari Movie).
షూటింగ్ పూర్తయింది...
డబ్బింగ్ మొదలైంది
తెలుగు దర్శక - నిర్మాతలతో వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ మధ్య షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా వరలక్ష్మి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.
''మా 'శబరి' చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. 'శబరి'లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశా. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు.
ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమని చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు. వరలక్ష్మి గారు నిర్మాతల నటి అని, ఆమెతో సినిమా చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించామన్నారు దర్శకుడు అనిల్ కాట్జ్. ఇది థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ... సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారని ఆయన తెలిపారు.
Also Read : ఇండియాలో 'అవతార్ 2' కలెక్షన్లు - 17 కోట్లలో 6 కోట్లు తెలుగు ప్రేక్షకుల డబ్బే
View this post on Instagram
గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణ తేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, పోరాటాలు : నందు - నూర్, నృత్య దర్శకత్వం : సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, కళా దర్శకత్వం : ఆశిష్ తేజ పూలాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సీతారామరాజు మల్లెల, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాత : మహేంద్ర నాథ్ కూండ్ల, దర్శకత్వం : అనిల్ కాట్జ్.