YSRCP News: మంత్రి జయరామ్, ఎమ్మెల్యేలు పార్థసారథి, వసంతపై వైసీపీకి ఫుల్ క్లారిటీ ఉందా ?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్న ఆయన...ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచారు.
Andhra Pradesh Politics : ముఖ్యమంత్రి (Cm)జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్న ఆయన...ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచారు. ప్రతిపక్షాలను దుష్టచతుష్టయంతో పోల్చుతున్నారు. తనను తాను అర్జునుడితో పోల్చుకుంటున్న సీఎం జగన్...తెలుగుదేశం (TDP), జనసేన (Janasena)వాటి మిత్రపక్షాలను కౌరవులతో పోల్చుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏమేం చేయాలో అన్ని చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు...ఏకంగా 40 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు నిరాకరించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇందులో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మరో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మరో నేత తొలిసారి మైలవరం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వసంత క్రిష్ణ ప్రసాద్. ఈ ముగ్గురు నేతలు ఊగిసలాటలో ఉన్నప్పటికీ...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వారు ఎన్ని విన్నపాలు చేసి...పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే సీటు విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు జగన్.
ఎంపీగా పోటీ చేసేందుకు జయరాం నిరాకరణ
కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందిన గుమ్మనూరు జయరాం...ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ను ఆయనకు టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో జయరాం బద్ద వ్యతిరేకి విరుపాక్షకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించింది. తనకు పార్లమెంట్ సీటు కేటాయించడం కంటే విరుపాక్షకు ఆలూరు బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన పక్క పార్టీలతో సంప్రదింపులు జరిపారు. తర్వాత ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
నేడు వసంత కృష్ణప్రసాద్ కీలక సమావేశం
మైలవరం నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయల పనులు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజలకిచ్చిన మాట ప్రకారం 150 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఆపేసింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లోలోపల రగిలిపోతున్నారు. తన భవిషత్ పై ఎప్పుడు చీకటి పడుతుందా ? ఎప్పుడు తెల్లారుతుందా అంటూ కామెంట్ చేశారు. ఆదివారం నియోజకవర్గ, మండలస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. సోమవారం ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నట్టు చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ వర్గం నేతలపై వైసీపీ వేటువేసింది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల మైలవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. దీంతో సోమవారం సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారని, సంప్రదింపులు జరుపుతున్నారని వైసీపీ భావిస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కొంతకాలంగా వైసీపీ హైకమాండ్ పై నిరసనగళం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోయినా...పెనమలూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించారంటూ బీసీ సాధికార బస్సు బహిరంగ సభలోనే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తనకన్న జూనియర్ అయిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు మంత్రి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నూజివీడు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీలో మిస్సయిన మంత్రి పదవి...టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని భావిస్తున్నారు.