Salur Constituency: సాలూరు ఎన్నికల పోరు - ఈసారి గెలుపెవరిదో?
Who will be sidelined this time in Salur : ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం సాలూరు. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16సార్లు ఎన్నికలు జరిగాయి.
Salur Constituency Election: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం సాలూరు. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,88,217 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 92,999 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 95,207 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఇవీ ఎన్నికల ఫలితాల తీరు
ఈ నియోజకవర్గం ఏర్పాటైన తరువాత తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కేవీ దొర తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఏవై నాయుడుపై 12,642 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీ రాజయ్య తన సమీప ప్రత్యర్థి పీఎస్పీ నుంచి పోటీ చేసిన డీఎస్ దొరపై 4682 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇదే ఏడాది ద్వి సభకు జరిగిన ఎన్నికల్లో పీఎస్పీ నుంచి పోటీ చేసిన ఏవై నాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేవీ దొరపై 4596 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్‌ఎన్ సన్యాసిరాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏవై నాయుడిపై 9589 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బి రాజయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జన్ని ముత్యాలుపై 7356 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జన్ని ముత్యాలు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనసంఘ్ నుంచి పోటీ చేసిన అన్నమరాజాపై 12,655 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎనిఇ్నకల్లో సీపీఐ నుంచి పోటీ చేసిన ఎస్‌ఆర్‌టీపీ రాజు తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎల్‌ఎన్ సన్యాసిరాజుపై 4649 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బీ రాజయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి అప్పన్నపై 16,124 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రాజయ్య మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎల్‌ఎన్ సన్యాసిరాజుపై 7636 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎల్‌ఎన్ సన్యాసిరాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్‌పీ భంజ్‌దేవ్‌పై 641 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్పీ భంజ్ దేవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వీసీ సన్యాసిరాజుపై 29,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్పీ భంజ్ దేవ్ మరోసారి విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి సంధ్యారాణిపై 14,970 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్పీ భంజ్ దేవ్ మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి రాజన్నదొరపై 2493 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2007లో కోర్టు ద్వారా ఇక్కడ నుంచి పి రాజన్నదొర ఎన్నికైనట్టు ప్రకటించబడ్డారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి రాజన్నదొర తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జి సంధ్యారాణిపై 1656 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పి రాజన్నదొర మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్‌పీ భంజ్‌దేవ్‌పై 4997 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రాజన్నదొర ఇక్కడి నుంచి మూడోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్‌పీ భంజ్‌దేవ్‌పై 20,029 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
నాలుగుసార్లు రాజన్నదొర.. మూడుసార్లు భంజ్‌దేవ్
ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి భంజ్‌దేవ్, కాంగ్రెస్, వైసీపీ నుంచి రాజన్నదొర నాలుగుసార్లు చొప్పున విజయం సాధించారు. 1994 నుంచి 2004 వరకు జరిగిన మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భంజ్‌దేవ్ మూడుసార్లు విజయం సాధించారు. అయితే, 2007లో కోర్టు రాజన్న దొర ఎన్నికైనట్టు ప్రకటించింది. 2009 నుంచి 2019 వరకు జరిగిన వరుస మూడు ఎన్నికల్లో రాజన్న దొర గెలుస్తూ వస్తున్నారు. కోర్టు ద్వారా ఎన్నికతో కలిపి రాజన్నదొర నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించినట్టు అయింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాజన్నదొర మరోసారి ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. టీడీపీ నుంచి భంజ్‌దేవ్‌తోపాటు మరికొందరు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.