Elections 2024: ఓటరు చైతన్యం పోటెత్తనుందా? - గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగేనా?
Andhra Pradesh News: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సిద్ధం అవుతున్న క్రమంలో ఓటరు చైతన్యంపై చర్చ సాగుతోంది. ఏపీలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Voting Percentage Will May Increase Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలు.. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, గత 3 విడతల పోలింగ్ లో అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా నగరాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం లేదు. గత గణాంకాలు చూస్తే.. 1952 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 55 - 68 శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా గత రెండు ఎన్నికల్లో వరుసగా.. 2019లో 67.4 శాతం నమోదైతే.. 2014లో 66.4 శాతం నమోదైనట్లు ఈసీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఈసీ చర్యలు, ప్రజా చైతన్యంతో.. ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
ఏపీలో ఓటెత్తుతారా.?
ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు, ఈసారి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాల్లోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తోంది. అటు, అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి.. వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.
గత గణాంకాలు చూస్తే..
గత ఎన్నికల్లో చూస్తే ప్రతిసారీ ఓటింగ్ శాతం పెరుగుతూనే వస్తోంది. గడిచిన 20 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ, విభజన తర్వాత కూడా అదే పంథా కొనసాగింది. 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ జరిగితే.. ఈసారి 80 శాతం దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఉమ్మడి ఏపీలో 69.96 పోలింగ్ శాతం నమోదైతే.. 2009లో 72.72 పోలింగ్ శాతం నమోదైంది. విభజన తర్వాత 2014లో 78.41 శాతం.. 2019లో 79.64 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో..
అటు, తెలంగాణలో ఎన్నికలొప్పుడొచ్చినా నగరవాసులు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గత లోక్ సభ ఎన్నికలు పరిశీలిస్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిల్లో 55 శాతానికి మించి ఓటింగ్ నమోదు కావడం లేదు. రాజధాని పరిధిలో 1991లోనే అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 1984లో 76.8 శాతం, 1989లో 71.3 శాతం, 1998లో 73.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో 2004లోనే అత్యధికంగా 59.9 పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యదికంగా యాదాద్రి జిల్లాలో 90.36 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా.? లేదా.? అనేది ఆసక్తిగా మారింది.
Also Read: Election Campaign Ends: ఏపీ, తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు