TDP Into NDA: 8కిపైగా ఎంపీ స్థానాలు అడుగుతున్న బీజేపీ- నాలుగు ఇస్తామంటున్న టీడీపీ- నేడు మరోసారి చర్చలు
TDP And BJP: ఐదేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ మరోసారి ఒక్కటి కానున్నాయి.గురువారం అర్థరాత్రి ఓ దఫ చర్చలు జరిగాయి. నేడు తుది విడత చర్చలు జరగనున్నాయి.
TDP News: ఐదేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ మరోసారి ఒక్కటి కానున్నాయి. పదేళ్ల తర్వాత 2014 కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్‌లో రిపీట్ కానుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నారు. ఎన్నో రోజులుగా సాగుతున్న సీరియల్ సస్పెన్షన్‌కు ఇవాళ తెరపడనుంది.
ప్రత్యేక హోదా డిమాండ్‌తో 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టింది. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది. అప్పటి నుంచి టీడీపీ అధినేత సైలెంట్ అయిపోయారు. కేంద్రంపై విమర్శలు కూడా తగ్గించారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీ, టీడీపీ మధ్య దూరం తగ్గుతూ వస్తోంది. ఇన్ని రోజులు దీనిపై సస్పెన్ష్ కొనసాగుతూ వస్తుంది. ఇదిగో రేపు చేరుతున్నారు. ఎల్లుండి చేరుతున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గురువారం అర్థరాత్రి ఓ దఫ చర్చలు జరిగాయి. నేడు తుది విడత చర్చలు జరగనున్నాయి. అనంతరం ఎన్డీఏలో టీడీపీ చేరుతున్నట్టు ప్రకటన చేయనున్నారు.
పవన్ కల్యాణ్ చర్చలు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లిందని టీడీపీ, జనసేన ముందు నుంచి విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఐదేళ్ల పాలనలోనే ఇంత ఘోరాలు జరిగితే మరో ఛాన్స్ జగన్‌కు ఇస్తే మాత్రం రాష్ట్రం మరింత కష్టాల ఊబిలో కూరుకుపోతుందని అభిప్రాయపడ్డాయి. అందుకే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా వ్యూహాన్ని రచిస్తున్నామని రెండేళ్ల క్రితమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అప్పటి నుంచి 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాను చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నానని ఈ మధ్యే చెప్పారు. అటు టీడీపీ కూడా ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సమయం చిక్కినప్పుడల్లా కేంద్రం విధానాలు, మోదీ పని తీరుపై పొగడ్తలు వర్షం కురిపించారు చంద్రబాబు.
మొతానికి అన్ని ప్రయత్నాలు ఫలించి ఎన్డీఏ గూటికి టీడీపీ చేరుకుంది. ఇప్పుడు సీట్ల లెక్క తేలాల్సి ఉంది. ఇన్ని రోజులు ఈ సీట్ల లెక్కతోనే కూటమిలో చేరిక ఆవలస్యమైందని విశ్లేషణలు వినిపించాయి. బీజేపీ మెజార్టీ ఎంపీ స్థానాలు ఆశిస్తోందని ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సస్పెన్ష్ కూడా తేలిపోయే సమయం వచ్చింది. ఈ సీట్ల సర్దుబాటుపై నేడు టిడీపీ, బీజేపీ, జనసేన అధినేతలు కూర్చొని మాట్లాడుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 118 సీట్లను టీడీపీ జనసేన సర్దుబాటు చేసుకున్నాయి. ఇప్పుడు మిగిలిన సీట్లలో బీజేపీతోపాటు టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు 25 ఎంపీ స్థానాల్లో జనసేనకు మూడు లోక్‌సభ స్థానాలు ఇస్తామని ఇదివరకే ప్రకటించారు. అంటే 22 ఎంపీ స్థానాలను టీడీపీ, బీజేపీ సర్దుబాటు చేసుకోవాలి. వీటిలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనే చర్చ ఇవాళ జరగనుంది.
గురువారం సాయంత్రం ఢిల్లీ వేర్వేరుగా చేరుకున్న చంద్రబాబు , పవన్ కల్యాణ్ రాత్రి పదిన్నరకు అమిత్‌షాతో సమావేశమయ్యారు. అక్కడే జేపీ నడ్డా కూడా ఉన్నారు. నలుగురూ కలిసి ఏపీ రాజకీయాలు, ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించడంపై చర్చించారు. ఈ చర్చలు గంటకుపైగా సాగాయి. ఈ చర్చల సందర్భంగా తమకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వాలని అమిత్‌షా ప్రతిపాదించారు. 8 నుంచి 10 వరకు ఇస్తే బాగుటుందని అన్నారు. 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని అందుకే ఎక్కవ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు.
దీనికిపై స్పందించిన చంద్రబాబు... నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ చర్చలు ఇంకా కొనసాగించాలని ఇవాళ కూడా ఢిల్లీలో ఉండాలని చంద్రబాబు, పవన్‌కు బీజేపీ సూచించింది. దీంతో ఈ లెక్క ఇవాళ తేలిపోనుంది.