Telangana Election Results Today: తెలంగాణలో ఓట్ల కౌంటింగ్‌కు ఎన్ని వేల మంది పని చేయాలో తెలుసా?
Telangana Lok Sabha Election Results 2024: నేడు జరగనున్న తెలంగాణ లోక్ సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి.

Heavy Security in Telangana: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పా్ట్లు చేసింది. మంగళవారం (జూన్ 4) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా ఇతర పార్టీల వారు, స్వత్రంత్రులు మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. కౌంటింగ్ జరిగనున్నందున నేడు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు లిక్కర్ షాపులు బంద్ ఉండనున్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల లెక్కింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 120 హాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. దీని కోసం 19 హాల్స్ లో 276 టేబుళ్లు కేటాయించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల లెక్కింపు నేడు (జూన్ 4) సాయంత్రం 4 వరకు జరిగే అవకాశం ఉంది. అప్పటికి అన్ని లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి అవుతాయి. సుమారు 10 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. వీరికి మూడు విడతల ట్రైనింగ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి 49 మంది అబ్జర్వర్లు రాష్ట్రానికి వచ్చారు. వారితోపాటు మరో 2,414 మంది మైక్రో అబ్జర్వర్లు పని చేస్తున్నారు.
ఈ సెగ్మెంట్లలో ఫలితం ఆలస్యం
అత్యధికంగా 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల ఫలితం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో మాత్రమే లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో త్వరగా ఫలితం తేలనుంది.
ఇక ఓట్ల లెక్కింపు వేళ కౌంటింగ్ కేంద్రాల వద్ద గొడవలు, ఘర్షణలు జరగకుండా ఎన్నికల సంఘం భారీగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు, సీసీటీవీ కెమెరాల నిఘా ఉండనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

