Telangana Elections 2023 : ప్రలోభాల్లో ఎవరూ తగ్గట్లే - కొన్ని డబ్బులు డిమాండ్ చే్సతున్న ఓటర్లు !
Elections Money : తెలంగాణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం ప్రభావం కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఓటర్లు తమకు డబ్బులివ్వలేదని పార్టీలను నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Telangana Elections Money Distribution : అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని ఊహించడం కష్టంగా మారింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియిడంతో ప్రధాన పార్టీలు గల్లీ గల్లీలలో పైసలు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ప్రధానంగా మూడు పార్టీలు తమ తమ కార్యకర్తలకు వారి పార్టీ సభ్యులకు డబ్బులు పంచారు. ఈ డబ్బులు పంచడాన్ని పలు చోట్ల ఇతర పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పేదలు ఉండే కాలనీలతో పాటు ఈ సారి మధ్య తరగతి జీవులు ఉండే కాలనీల్లోనూ మద్యం , నగదు పంపిణీ చేస్తున్నారు. గల్లీలలో ఓటుకు వెయ్యి నుంచి 5000 వరకు పంచుతున్నారని తెలియడంతో స్థానిక ప్రజలు తమకు కూడా డబ్బులు వస్తాయని పంచే వారి దగ్గరికి వెళ్తే మీరు మా పార్టీ కాదు కదా మేము ఎందుకు ఇవ్వాలి అంటూ వెనక్కి పంపుతున్నారు. దాంతో ప్రజలే పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి వరకు పంచుతున్నటువంటి డబ్బులను పోలీసులు వస్తున్నారని సమాచారం ఇస్తున్నారు. బుధవారం ఉదయం 4, 5 గంటల నుండే డబ్బులు పంపకాలు మొదలైయ్యాయి. అపార్ట్మెంట్లు, కుల సంఘాల వారికి సుమారు 15 వేల చొప్పున అందజేస్తూ మధ్యాన్ని సైతం పంచిపెట్టారు.
డబ్బుల పంపిణీలో కొన్ని చోట్ల నగదు పట్టుబడుతోంది. ఎక్కువ భాగం పంపిణీ అవుతున్నాయి. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీల ద్వారా ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించిన నాయకులు.. కొందరికి ఫోన్‌చేసి ఫలానా వారు వస్తారని చెబుతున్నారు. ఒక్క ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చి వెళ్తున్నారని కొందరు ఓటర్లు వెల్లడించారు. పగలయితే డబ్బులు ఇస్తున్నారని తెలిసిపోతుందనే, తెల్లవారుజామున ఓటర్లకు మనీ ఇవ్వడానికి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో డబ్బు అందని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఇవ్వట్లేదని నాయకులపై మండిపడుతున్నారు.
ప్రత్యర్థులు పంచే మొత్తాన్ని బట్టి బుధవారం రాత్రి మరికొంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు ఇస్తున్నారు. ఈ జిల్లాలోని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనరల్‌స్థానాల్లో మొదటి విడతగా రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్జిల్లాలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టచెప్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని జనరల్‌స్థానాల్లో రూ.2 వేలు, రిజర్వుడ్స్థానాల్లో రూ.వెయ్యి వరకు ఇస్తున్నారు. గ్రేటర్సిటీలోని కాలనీల్లోనూ ఒక్కో ఓటుకు రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. అన్ని చోట్ల మందుతో విందులు ఇస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు.