EC Notice To KTR: కాంగ్రెస్ ఫిర్యాదుతో మంత్రి కేటీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు
Election Commission Notice To KTR: హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు చేసిన ప్రత్యర్థి పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేస్తుంటాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ (Election code violation) కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో ఎలక్షన్ కమిషన్ కోరింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అశోక్ నగర్ వెళ్లి వర్సిటీ విద్యార్థులతో పాటు నిరుద్యోగులతో సమావేశం అవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు భరోసా ఇవ్వడం తెలిసిందే. అయితే ‘టీ’ వర్క్స్ భేటీలో.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు కేటీఆర్ హామీ ఇచ్చారు. కొన్ని తప్పులు జరిగినట్లు ప్రభుత్వమే గుర్తించిందని, బయటివాళ్లు చెప్పకముందే తామే చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేపర్ల లీక్ కారణంగా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్ ను వినియోగించారని కాంగ్రెస్ నేత సుర్జేవాల మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. అన్ని విషయాలు పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల నియామవాళిని కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.